Monday, June 9, 2008

Manachuttu Vinta Mokkalu

మన చుట్టూ వింత మొక్కలు


రచన :
కొత్త శేషాద్రి శేఖరం పిహెచ్.డి
Written :1976

Kotha Sekharam Ph.D

kothasekharam@gmail.com



ముందు మాట
ఈ ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో వింతలు - విడ్డూరాలు ఉన్నాయి. అవన్నీ ఎక్కడెక్కడో కాదు, మన తోటే, మన చుట్టూతే ఉన్నాయి. వాటిని రోజూ చూస్తూనే ఉంటాం. బహుశః సరిగ్గా పరిశీలించి ఉండం అంతే..

వేటి సంగతో ఎందుకు! మొక్కల విషయం చూడండి..మనలోఎన్ని రకాల మనుషులున్నారో ! మొక్కల్లో కూడా అన్నేరకాలున్నాయి.మంచివి - చెడువి, పనిచేసేవి - సోమరి పోతువి, దొంగతనం చేసేవి - దొరతనం చూపేవి, ఫ్రాణం ఇచ్చేవి - ప్రాణం పుచ్చుకునేవి, ఇలా ఎన్నో,ఎన్నెన్నో..అడిగితే ఒక్కొక్కటి ఒక్కొక్క కధ చెపుతుంది..

ఎక్కువగా నేల మీదే కనిపించినా కొన్ని మాత్రం చెట్లెక్కి కూర్చుంటాయి,మరి కొన్ని నీళ్ళల్లో దాక్కుంటాయి,ఇంకా కొన్ని ఎడారుల్లోకి పారి పోతాయి.

మన స్నేహితులు మనలోనే కనిపిస్తారు; మొక్కల స్నేహితులు చీమల్లో కూడా కనిపిస్తున్నారు.



మనసుకు కష్టం కలిగినపుడు బాధతో నాలుగు కన్నీటి బొట్లు "టప టప" రాల్చే సున్నిత హృదయం కల మొక్కలున్నాయి.

సిగ్గు బిడియంతో తలలు దించేసుకునేవి ఉన్నాయి. మాతృప్రేమను ఒలికించేవి మరి కొన్ని ఉన్నాయి. పాలిచ్చేవీ లేకపోలేదు.

నాన్-వెజిటేరియన్ ఆహారం తినే మొక్కలున్నాయంటే ఆశ్చర్య పడనవసరంలేదు. చాల మట్టుకు తమ వంట-వాడ్పు తామే చేసుకుంటాయి, మిగిలింది పొదుపుగా దాచుకుంటాయి; పైగా కాపలా కూడా పెడతాయి. లేకపోతే మొక్కల నుండి ఆహారాన్ని కాజేసే మొక్కలు లేకపోలేదు.

గేడి కొంగల్లా తెగపెరిగి ఆకాశానికి అంటేవి ఉన్నాయి. అంత ఎత్తుంటాయి కాబట్టి పడిపోతామేమోననే భయంతో ఎన్ని "వేషాలు " వేస్తాయో చూస్తే ఆశ్ఛర్యం కలుగుతుంది! ఇంత తెలివైనవా! అనిపిస్తుంది.

వందల సంవత్సరాలు బతికే చిరంజీవులున్నాయి.

వీటిని గురించి వివరంగా వరసగా చూద్దాం..



మన చుట్టూ వందలు, వేలు,లక్షల్లో ఉన్నాయి మొక్కలు. మనలాగానే పెరుగుతుంటాయి; మనకోసమే పెరుగుతుంటాయి. కొమ్మలతో, రెమ్మలతో, ఒంటి నిండా ఆకులతో, ఆ ఆకులకు పచ్చ రంగు పులుముకొని, ఆ ఆకుల మధ్య రంగు రంగుల పూలు తురుముకుని, నాజూకుగా పెరిగి అందంగా కనిపిస్తాయి.

తినటానికి మనలాగ నోరు లేకపోయినా, మాట్లాడేందుకు నాలుక లేకపోయినా, నడిచేందుకు కాళ్ళు లేకపోయినా మనకంటే ఎక్కువే తింటాయి, మనకంటే ఎక్కువ కాలమే బతుకుతాయి, మనకంటే సుఖంగానే జీవిస్తాయి. అందరికీ ఉపయోగపదుతూ, సహాయం చేస్తూ బతికే పరోపకారులు ఈమొక్కలు.

2


మొక్కలు ఉండక పోతే మనమూ ఉండం

ఈ భూమి మీద మొక్కలు కనుక లేకపోతే మనమెవ్వరం బతికి బట్టకట్టలేం. మనమే కాదు బహుశః ఏ జీవి బతకదేమో! ఎందుకంటె భూమి మీద పెరిగే ప్రతి జీవి జీవించడానికి మొక్కల సహాయపడతాయి
.

తమకు కావలసిన ఆహారం తమంతట తామే తయారు చేసుకోగల శక్తి ఒక్క మొక్కలకు మాత్రమే ఉంది. ఆహారం తయారు చేసుకోడానికి వాటికి కావలసిన ముడి పదార్ధాలు మూడే మూడు- నేల నుండి నీళ్ళు, ఆపైన గాలి, ఎండ. ఈమూడిటిని "కలుపుకొని" ఆహారం తయారు చేసుకోగలవు మొక్కలు.

ఈ పని మనమెవ్వరం చేయలేం కాబట్టి, ఈపని చేయగలిగిన మొక్కల మీద మనమంతా ఆధారపడతాం. ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని ప్రతి జీవి వీటి మీదనే ఆధారపడుతుంది.

ఎండ,వాన,గాలి,చలి అన్ని ప్రదేశాలలోను ఒకే విధంగా ఉండవు కాబట్టి ఆయా ప్రదేశాలలో కనిపించే

3


మొక్కలు ఆయా ప్రాంతాలకు అనుగుణంగా సర్దుకుని పెరుగుతాయి.

చలివేస్తే దుప్పట్లు కప్పుకొన్నట్లు, వానొస్తే గొడుగు వేసుకున్నట్లే ఇవి కూడా వాతావరణ పరిస్తితులకు తగ్గట్లు జాగ్రత్తలు తీసుకుంటాయి. "ఏ ఎండకు ఆ గొడుగు " పడతాయి.

ఇప్పటి వరకు శాస్త్రజ్ఞులు మూడున్నరలక్షలకు పైగా మొక్కల రకాలను గుర్తించారు. ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇన్ని మొక్కల్లో మొక్కకు మొక్కకు ఏదో కొద్దిపాటి పోలికలున్నా కనీసం ఏదో ఒక్క విషయం లోనైనా తేడా కనిపిస్తుంది.

నేల మీదే ఎక్కువ
ఉన్న మొక్కల్లో ఎక్కువ నేలమీదే కనిపిస్తాయి. వేళ్ళు నేల లోపలికి, కాండం నేల పైకి, కాండానికి కొమ్మల,రెమ్మలు, వాటికి ఆకులు పూవులు..ఇదీ వరస.

మొక్క బరువంతా స్తంభంలా ఉండే కాండం భరిస్తుంది.

4


నేల లోపల విస్తరించే వేళ్ళు నీళ్ళని పీలుస్తూ మొక్క మిగతా భాగాలకు సరఫరా చేయటమే కాకుండ గాలికి మొక్క పడిపోకుండా గట్టిగా పట్టిఉంచుతాయి.

వేళ్ళు నీళ్ళను పీలుస్తాయి. ఆకులు గాలిని పీలుస్తాయి.ఆహారం ఆకుల్లో తయారవుతుంది. వేళ్ళు పీల్చిన నీళ్ళు, కాండంలో ఉండే సన్న సన్నని గొట్టాల ద్వారా కావలసిన ఆకులకు అందచేయబడుతుంది. ఇదే విధంగా ఆకుల్లో తయారైన ఆహారం మొక్కలో ఎక్కడ ఏభాగంలో దాచుకోవాలని అనుకుంటుందో అక్కడకు పంపబడుతుంది.

తయారయిన ఆహారం చిలగడ దుంప, బంగాళ దుంపల లాగ నేల లోపల ఊరవచ్చు, మామిడి,అరటి లాగ కాయల్లోకి చేరవచ్చు. చెరకు మాదిరిగా కాండంలో నిలవ ఉండవచ్చు.


పెరిగి యుక్తవయస్సు వచ్చాక తగిన విధంగా సంవత్సరానికి ఒక్కమారో,రెండుమార్లో ,ఎలాగైతేఅలా పూలు పూస్తాయి. పూలు కాయలవ్వగా, కాయల్లో గింజలు తయారవుతాయి.గింజలు మొలకెత్తితే మరోమొక్క తయారు..

5


ఇదంతా సాధారణంగా మనకు కనిపించే మొక్కల సంగతి. అయితే అన్ని మొక్కలు ఇలాగే ఉండాలని లేదు. ఎంతో తేడా కనిపిస్తుంది.

చెట్లెక్కి కూర్చునే చెట్లు

"ఊరందరిదీ ఒక దారైతే ఉలిపి కట్టెది మరోదారి" అన్నట్లుగా నేలమీద సలక్షణంగా లక్షల రకాల చెట్లు పెరుగుతూ ఉంటె కొన్ని మాత్రం అసలు నేల మీదే అడుగుపెట్టవు; చెట్లెక్కి కూర్చుంటాయి. ఎన్నడూ దిగి రావు.

అన్నిటిలా నేల మీద పెరిగితే కావలసినన్ని నీళ్ళు దొరుకుతాయి, ఎండ తగులుతుంది, సుఖంగా బతకవచ్చు కదా..ఇన్ని సుఖాలు వదులుకొని చెట్ల మీదకు చేరవలసిన అగత్యం ఏమి కలిగింది? అసలు ఎలా బతగ గలుగు తున్నాయి?

ఈ మాటే వాటినడిగితే .. "ఓ! మాకేం, హాయిగా బతుకుతున్నామని" చెపుతాయి."కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరి" అని అంటాయి. అవేమిటోవిందాం..

అన్ని మొక్కలకు ఒక్క రకం వేళ్ళు మాత్రమే ఉంటే ఈ మొక్కలకు రెండు రకాల వేళ్ళుంటాయి.

6


పెద్ద పెద్ద చెట్ల కొమ్మల మీద పెరుగుతుంటాయి కాబట్టి ఈమొక్కలు పడిపోయే ప్రమాదం ఉంది. అందుకని ఒక రకం వేళ్ళు ఈమొక్కలను జారిపడిపోకుండ కాపాడటానికి ఉపయోగపడతాయి. ఎలాగంటే పెరిగే కొమ్మ బెరడు లోకి ఆవేళ్ళు చొచ్చుకొని గట్టి పట్టు పట్టి ఉంచుతాయి.

చెట్ల మీద పెరిగే ఈమొక్కలకు నీళ్ళెలా అందుతాయి? ఈ సమస్యను తీర్చటమే వీటికి ఉండే మరో రకం వేళ్ళ పని. గాలి లోకి వేలాడుతూ ఉండే ఈ వేళ్ళు మెత్తగా స్పాంజిలా ఉండటాన "బ్లాటింగ్ పేపరు" సిరానెలా పీలుస్తుందో అదే విధంగా ఈ వేళ్ళు గాలి లోని తేమను పీల్చుకుంటాయి.

ఎలాగైనా మొత్తం మీద దొరికే నీరు తక్కువే కాబట్టి కాస్త పొదుపుగా వాడుకుంటాయి.

ఏ పనికీ ఇవి చెట్ల నుండి దిగి రావు. పూలు పూసి విత్తనాలు తయారవగా అవి గూడ మరో చెట్టును చూసుకుంటాయి. వాటంతట అవే పోవు. ఈ పనికి ఏ ఉడతలో పక్షులో సహాయపడతాయి. వీటి గింజల చుట్టూ ఉండే జిగట పదార్ధం వల్ల పక్షుల శరీరానికి అంటుకుంటూయి. పక్షులు ఒక చెట్టు మీది నుండి మరో చెట్టు మీదికి ఎగిరేటపుడు

7


ఇవి కూడ వాటితోపాటే అక్కడకు చేరతాయి. అనుకూల పరిస్థితుల్లో పెరిగి పెద్దవవుతాయి.

ఎంతో పెద్దవిగా పెరిగే మఱ్ఱి, రావి చెట్లు కూడా ఒక్కోసారి ఏ చెట్టు మీదనో పెరగటం ప్రారంభిస్తాయి. ఆ తర్వాత క్రమ క్రమంగా వేళ్ళను నేలలోనికి దింపి పాతుకు పోతాయి.

కుక్కలు పందులు వేటాడే మొక్కలు

చెట్లన్నీ నేలమీదే పెరగాలని లేదు, మన కంటికి కనిపించాలనీ లేదు. నేలకింద దాక్కునే మొక్కలు లేకపోలేదు. కొన్ని మొక్కలు మరీ చిన్నవవటాన కంటికి కనిపించవు, మరి కొన్ని పెద్దవే అయినా నేల కిందనే ఉండటాన మన కంటికి కనపడవు.

ఇలాంటివే పుట్ట గొడుగులు ఇవీ మొక్కలే. చిన్నవిగా ఉండటాన, మిగిలిన మొక్కల్లాగ కనిపించక పోవటాన, వీటిని అసలు మొక్కలనే అనుకోరు.

ఈ జాతి మొక్కల్లో ఒకటైన "ట్రఫుల్స్" రకం పుట్టగొడుగులు నేలలోపలే పెరిగి, వ్యాపించి, పుష్పిస్తాయి. నేలమీదకు కనిపించకపోవటాన ఇవి పెరిగినట్లు, పుష్పించినట్లు, అసలు ఉన్నట్లే ఎవరికీ తెలియదు.

8


కాని తినటానికి ఇవి చాల రుచిగా ఉండటాన వీటిని ఎవ్వరూ వదిలి పెట్టరు. ఎక్కడున్నా సరే వెదికి వేటాడి తింటారు.

ఇవి పెరిగినట్లు కనిపించకపోయినా, పెరిగిన తర్వాత నేల మీదకు కొంత సువాసన వస్తుంది. కాని మనం దానిని కూడ గుర్తించలేం. అదే కుక్కలు, పందులు, ఈ వాసనను తేలికగా గుర్తుపట్టగలవు. వాసనను గుర్తించగానే అవి పెరిగిన చోట కాళ్ళతో మట్టిని లాగి బయటకు తీసి ఇష్టంగా తింటాయి.

మనిషి తెలివైన వాడు కాబట్టి తాను చేయలేని ఈపని చేయటానికి వాటినే ఉపయోగిస్తున్నాడు.

కుక్కల మూతులు బిగించి (లేకపోతే అవే తినేస్తాయి) అడవుల్లోకి తీసుకు వెళతారు. ఈ పుట్ట గొడుగులు పెరిగేచోట వాటి వాసనను గుర్తు పట్టిన కుక్క వెంటనే ఆగి, నేలమీద మట్టిని కాలితో లాగటం మొదలు పెడుతుంది. కుక్కను పక్కకు లాగి, వెంటనే నేలను తవ్వి పుట్టగొడుగుల్ని బయటకు తీస్తారు.

వీటి లాగానే బూజు జాతి మొక్కలు కొన్ని వేల రకాలు కనిపిస్తాయి నేలమీద. అయితే అవన్నీ సూక్ష్మంగా ఉండటాన అసలు పెరుగుతున్నట్లే అనుకోం.

9


నీళ్ళలో దాక్కునేవి

భారతంలో ఒక సన్నివేశం: సుయోధనుణ్ణి భీముడు వెంటాడుతుంటాడు. భీముడికి చేతకానిది, సుయోధనుడికి చేతనయింది ఒకటుంది. అది - జలస్తంభన విద్య. దాని మూలాన ఊపిరి బిగపెట్టి ఎంతసేపైనా నీళ్ళలో ఉండగలడు. అందుచేత భీముడి చేతబడకుండ తప్పించుకొనటానికై ఈ విద్యను ఉపయోగించి నీళ్ళలో దాక్కుంటాడు. ఈ పని చేయలేని భీముడు దిక్కుతోచక తెల్లముఖం వేసుకుని ఒడ్డునే నిలబడి పోతాడు. సుయోధనుణ్ణి బయటకు ఈడ్చే మార్గం లేక నానామాటలు అని రోషం తెప్పిస్తాడు. ఆ మాటలు పడలేక అతడు బయటకు వస్తాడనుకోండి..అది వేరే విషయం.

ఇలా ఎంతో విలువైన విద్య, అరుదైన విద్య, ఎవరికి పడితే వారికి చేతకాని "నీళ్ళలో ఉండగలిగే విద్య" సాధారణంగా నేలమీద పెరిగే అల్పజీవులు - మొక్కలకు ఎలా అలవడింది?

నాచు, పాచి మొక్కలు నీళ్ళలోపల ఎలా పెరగ గలుతున్నాయి? తామర, బుడగ తామరలు నీళ్ళల్లో తప్పిస్తే బయట పెరగవుకదా? ఇదెలా వీలవుతుంది?

10


మనలాగానే మొక్కలు గాలి పీల్చాలి కదా,ఎండ కావాలి కదా? మరి ముక్కు మూసుకుని నీళ్ళల్లో కూర్చుంటే ఎలా వీలవుతుంది? సముద్రంలో వందల అడుగుల లోతున కూడ పెరిగే మొక్కలున్నాయి కదా..వాటి మాటేమిటి?

నిజంగా ఇది పెద్ద సమస్యే. అయితే బతక నేర్చిన కొన్ని మొక్కలు మాత్రం సునాయాసంగా ఈసమస్యను పరిష్కరించుకున్నాయి.

మనం నీళ్ళల్లో మునిగి పోతే పొట్ట నిండా నీళ్ళు చేరతాయి. అందుకని నీళ్ళలో పడ్డవారిని బయటకు తీసి, ముందుగా నీళ్ళు కక్కిస్తారు. అలాగే నీళ్ళల్లో పెరిగే మొక్కలు కూడ అవసరం ఉన్నా లేకపోయినా నీళ్ళు తెగ తాగవలసి వస్తుంది. తాగిన నీళ్ళన్నీ కక్కేయాలి కదా, అందుకని ఈ మొక్కలు తమ ఆకులకు ఎక్కువ "బెజ్జాలను" పెట్టుకుంటాయి. ఈ పత్ర రంధ్రాల ద్వారా తాగిన నీటిని బయటకు పంపేస్తాయి.

వంటి నిండా గదులే : బరువుంటే నీళ్ళల్లో మునిగి పోతారు. అలాగే మొక్కలు కూడ. అందుకని మరీ బరువు లేకుండ తగినంత భద్రంగా ఉండటానికై ఈ నీటి మొక్కల వేళ్ళు, కాడం, ఆకులు, మిగిలిన అన్ని భాగాలలో ఎన్నెన్నో గాలి గదులుంటాయి. బెలూను నిండా

11


గాలి ఉండటాన నీళ్ళల్లో ఎలా మునగదో ఇవి కూడ అంతే.

తామరాకు మీద నీటిబొట్టు అసలు నిలువలేదు. పాదరసంలా అటు - ఇటు ఊరికే కదిలి పోతుంది. ఆకు మీద నీరు నిలిస్తే ఆబరువుకి ఆకు నీళ్ళల్లో మునిగిపోవచ్చు. ఇదే కాకుండా మరోప్రమాదం కూడ ఉంది.

మొక్కల్లో మిగులు నీరు ఆకుల్లో ఉండే రంధ్రాల ద్వారా బయటకు పోతుంది. అన్ని మొక్కలలో ఈపత్ర రంధ్రాలు ఆకు కింద వైపున ఉండగా నీటి మొక్కలకు మాత్రం ఆకు పైవైపునే ఉంటాయి. ఎందుకో తెలుసా? తామరాకుల్లాంటి వాటి పైన గనుక నీరు నిలిస్తే ఆకుల్లోపలి నీరు బయటకు పోవటానికి అడ్డువస్తుంది. ఇంతే కాకుండా మరెన్నో నష్టాలున్నాయి.

అందుకని తెలివైనవి కాబట్టి ఈమొక్కలు వాటి ఆకుల పైన ఒక రకం మైనాన్ని పొరలాగ పూసుకుంటాయి. మైనానికి నీళ్ళు అంటుకోవు కదా. అందుకని ఈ ఆకులపైబడ్డ నీరు ఒక చోట నిలువదు. గాలికి అటు - ఇటు కదిలి, చివరకు జారిపోతుంది.

నీళ్ళ లోపల ఎన్నో నాచు, పాచి మొక్కలు పెరుగుతుంటాయి. అవన్నీ నీళ్ళలో కరిగిఉండే గాలినే పీలుస్తాయి. నీళ్ళ ద్వారావచ్చే వెలుతురునే వాడుకుంటాయి.

12

ఎడారుల్లోకి పారిపోయిన చెట్లు

ఎక్కడ సందు దొరికితే అక్కడ పెరిగే ఈ చెట్లు ఆఖరుకు ఎడారులను కూడ వదలిపెట్టలేదు. ఎడారుల్లో పెరగాలంటే మాటలు కాదు. ఎండ,వేడి, ఇసుక, పైగాతాగటానికి నీళ్ళు దొరకవు. నీళ్ళు లేనిదే ఏ జీవీ బతకు లేదుకదా.

ఎన్ని కష్టాలున్నా ఓర్చి, సహనంతో ఈమొక్కలు పెరుగుఇతుంటాయి. ఇవి మామూలు మొక్కల్లాంటివి కావు. ఎన్నెన్నో జాగ్రత్తలు తీసుకుంటాయి. మానవ మాత్రులెవ్వరూ సంచరించలేని చోట ఈ మొక్కలు పెరుగుతున్నాయంటే ఎంతో విశేషమే కదా. "ఏ ఎండ కా గొడుగు పట్టటం" చేతనవటాననే ఇవి జీవించ గలుగు తున్నాయి.

జీవులకు కావలసింది, ఎడారుల్లో తేలికగాదొరకనిది నీరు. సాధారణంగా దొరకదు, దొరికినా చాల తక్కువే కాబట్టి ఎడారి మొక్కలు చేతికి అందిన నీటిని వదిలి పెట్టవు. దొరికిన నీటిని దుబారా చేయవు.

ఎంతో పొదుపు.సాధారణంగా మొక్కలు తాగిన

13

నీటిని ఆకుల్లోని పత్రరంధ్రాల ద్వారా బయటకు పంపేస్తాయని తెలుసుకున్నాం. ఈ పత్రరంధ్రాలు ఎన్ని ఉంటే అంత నీరు బయటకు పోతుంది. తక్కువ ఉంటే బయటకు పోయే నీరు కూడ తక్కువే అవుతుంది. మరీ తక్కువే ఉంటే...?

పత్ర రంధ్రాలు ఆకులకు ఉంటాఆయి కాబట్టి అసలు ఆకులే లేకుండా చేస్తే...?

ఇది మరీ తెలివయిన పని కదా! ఇదే ఎడారి మొక్కలు చేసే పని.

తాగిన నీటిని పొదుపుగా వాడుకునేందుకు, దుబారా చేయకుండా ఉండేందుకు చాల ఎడారి మొక్కలు అసలు ఆకుల్నే తొడగవు. చెట్టంతా ముళ్ళు, కొమ్మలు, రెమ్మలతో కాడ లాగానో, కండ పట్టి దళసరిగానో ఉంటాయి. బ్రహ్మ జెముడు మొక్కను చూసే ఉంటారు. అలాగే ఉంటాయి చాల మొక్కలు.

దీని మూలాన నీరైతే వృధా కాదు కాని, మరి ఆకులే లేకపోతే ఆహారం తయారయ్యేది ఎలా? ఇదొక సమస్య. ఇందుకు గాను ఆకులమాదిరిగానే ఉంటాయి కాండం, కొమ్మలు, రెమ్మలు, వగైరాలన్నీ. ఇవన్నీ పచ్చరంగులో ఉండటాన ఆకులు చేసే పని ఇవే చేయగలుగుతాయి.

14

ఎప్పుడో రెండు మూడేళ్ళ కొకసారి సన్న జల్లు పదుతూ ఉంటుంది ఎడారుల్లో. ఆ పడిన కాసిన నీళ్ళు ఏమాత్రం జాగ్రత్త తీసుకొనకపోతే నేల లోపలికి ఇంకిపోతాయి, చేయి దాటి పోతాయి. అందుకని ఎడారుల్లోనూ, ఇసుక భూముల్లోనూ పెరిగే మొక్కల వేళ్ళు నేల మట్టానికి కొంచం కిందుగ బాగా వ్యాపించి ఉంటాయి. పడిన నీటిని పడినట్లే పీల్చేస్తాయి.

నీళ్ళు దొరకని ఇసుక భూముల్లో పెరిగే బ్రహ్మజెముడు, నాగజెముడు, సర్వి లాంటి మొక్కల్లో కూడ ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయి.

నీటి పొదుపు తెలిసినప్పుడు, కావలసినంత ఎండ ఉన్నప్పుడు కాస్త ఎక్కువ వేడి ఉంటే మాత్రం ఏం? పూలు పూస్తూ కాయల్ని కాస్తూ సుఖంగా బతక గలుగుతున్నాయి, ఈ ఎడారి మొక్కలు.

కంటికి కనిపించనివి కొన్ని

మన కంటికి కనిపించని మరుగుజ్జు మొక్కలు కూడా ఉన్నాయి. ఎంత మరుగుజ్జులంటే అసలు మన కంటికే ఆనవు. మరో పక్క మనం చూడ లేనంత పెద్దవిగా ఉండి ఆకాశానికి అంటేవి

15


కూడ ఉన్నాయి. ఇంత వైవిధ్యం మరే ఇతర జీవుల్లోనూ కనిపించదు.

ఈ చిన్న మొక్కలు ఎంత చిన్నవంటె వాటిని చూడటానికి ప్రత్యాకంగా ఒక పరికరం - సూక్ష్మదర్శనిని చేసుకోవలసి వచ్చింది. చిన్న చిన్నవిగా ఉంటాయి కాబట్టి వీటన్నిటినీ కలిపి సూక్ష్మజేవులని పేరుపెట్టారు.

పెరుగు తోడుకునేది సూక్ష్మజీవుల వల్లనే. ఆహార పదార్ధాలను తడి తగిలే చోట నాలుగు రోజులు ఉంచితే చెడిపోయి వాసన పట్టేది ఇవి పెరగటానే. నీళ్ళు తగిలితే పచ్చళ్ళ మీద, బ్రెడ్ మీద పట్టే బూజు కూడ ఈ మొక్కల వలనే. ఈచిన్న మొక్కలు కొన్ని పెద్ద మొక్కలపై పెరగటం వల్లనే ఆ మొక్కలకు తెగుళ్ళు పడతాయి. కల్లు కుండల్లో నుండి నురుగు వచ్చేది వాటిలో ఒక రకం మొక్క పెరగటం వల్లనే. మనకు మందుల్ని అందించే "పెనిసిలియం" కూడ ఈ మొక్కల్లో ఒకటే. ఇలాగే మనకు ఉపయోగ పడేవి, హాని కలిగించేవి ఎన్నెన్నో చిన్న మొక్కలయిన సూక్ష్మజీవులు ఉన్నాయి.

ఇటుకలతో గోడ కడతాం. ఇలాగే మన శరీరం కూడ చిన్న చిన్న కణాలనబడే "ఇటుకలతో" నిర్మించబడి ఉంటుంది. చెట్ల నిర్మాణం కూడా ఇంతే. మన కంటే చెట్లు చాల పెద్దవిగా ఉంటాయి. కాబట్టి ఎన్నెన్నో కణాలు ఉంటాయి. ఉదాహరణకు ఒక చదరపు మీటరు కాండంలో

16


35౦,౦౦౦.౦౦౦,౦౦౦ నుండి 5౦౦,౦౦౦,౦౦౦,౦౦౦ కణాలుంటాయి. ఒక చిన్న ముక్కలోనే యాభై వేల కోట్ల కణాలుంటే అసలు చెట్టంతా లెక్కవేస్తే ఎన్నుంటాయో?

ఇది ఇలా వుండగా, ఒక్క కణంతోనే నిర్మించబడిన మొక్కలు లేకపోలేదు. ఇవెంత చిన్నవిగా వుంటాయో ఊహించండి. వాటిని కొలిస్తే ఇలా ఉంటుంది..

అంగుళాన్ని యాభైవేల భాగాలు చేస్తే, అందులో ఒక్కొక్క భాగమంత ఉంటాయి కొన్ని సూక్ష్మ జీవులు. వీటికంటె చిన్నవి లేక పోలేదు. కొన్ని సూక్ష్మ జీవులు ఈపైన చెప్పిన వాటిలో సరిగ్గా సగమే వుంటాయి.

ఇతర జీవుల్లాగానే ఇవి కూడ ఆహారాన్ని తీసుకుంటాయి,పెరుగుటాయి, పిల్లల్ని "కంటాయి". ఇంకా ఎన్నో పనులు చేస్తుంటాయి.

ఇలాంటి మొక్కల్లో ఒకదానిని గురించి చెప్పాలంటె, "ఈస్టు" వుంది. పంచదారను పులియబెట్టి సారాయిని చేస్తుంది. అంటే పంచదారను ఆహారంగా తీసుకుని పెరుగుతుంది. పెరిగేటప్పుడు "శరీరం" నుండి తనకు పనికి రాని పదార్ధమైన సారాయిని విడుదల చేస్తుంది. తనకు పనికి రాక పోయినా అది మనకు మాత్రం బాగా

17


పనికి వస్తుంది. పరిశ్రమలలోకి, ఇతర విధాలుగా ఇది అవసరమవటం చేత ఈ ఈస్టును పెంచుతారు.

వీటికంటె కొంచెం పెద్దవి - బూజు మొక్కలు. కేవలం ఒక్క కణంతోనే సరిపెట్టుకోక కాసిని ఎక్కువ కణాలనే నిర్మించుకుంటాయి. ఉన్న కణాలు కూడ ఒక దాని తరువాత మరొకటి ఒక వరసలో అంటుకొని దారపు పోగుల్లా కనిపిస్తాయి.

బ్రెడ్ మీద, పచ్చళ్ళ మీద పట్టేది ఇదే. తెల్లగా, నల్లగా,ఎఱ్ఱగా, పచ్చగా, ఇంకా ఎన్నో రంగుల్లో కనిపిస్తాయి. ఇలాంటి వాటిలో ఒకటి పెనిసీలియం మొక్క. జ్వరం వస్తే డాక్టరు ఇచ్చే ఇంజక్షను మందు దీనినుండి వచ్చేదే.

18

అర్ధాంతరంగా ఊడిపడే మొక్కలు

వర్షం కురిసిన నాటి మరసట రోజు పొద్దున్నే ప్రత్యక్షమయ్యే పుట్టగొడుగుల్ని చూసే ఉంటారు. వాటిని పుట్టకుక్కులు, కుక్కగొడుగులని కూడ పిలుస్తారు. రాత్రికి రాత్రే ఇవి ఎలా వస్తాయి?

అందుకనే చాలమందికి ఇవంటే అనుమానం. ఇంత అర్ధాంతరంగా ఎక్కడ నుండి ఊడిపడతాయా అని ఆశ్చర్యం. పైగా ఇవి మొక్కలంటె చాల మంది నమ్మరు.

పుట్టగొడుగులు మొక్కలే. బూజు జాతి మొక్కలు. ఈరకాన్నే "శిలీంధ్రాలని" కూడ పిలుస్తారు. ఇవి ఎక్కడనుండో దిగి రావు. మిగతా మొక్కలలాగానే మెల్ల మెల్లగా పెరిగి నేలలోనుండి బయటకు వచ్చేవే.

మనకు నేలమీద (అంటే పుట్టలమీద కూడా) కనిపించే తెల్లటి బుడిపె లేక గొడుగు లాంటిది పూర్తి పుట్ట గొడుగు కాదు. పూర్తి పుట్టగొడుగు మొక్కలో కేవలం అదొక భాగం మాత్రమే.

ఇవీ మొక్కలే కాబట్టి వీటికీ వేళ్ళు, కాండం, మొదలైన భాగాలుంటాయి. అయితే ఆకుపచ్చని మొక్కలకు వీటికీ

19

కొన్ని విషయాలలో తేడా ఉండటాన వీటిని "వేళ్ళు" "కాండం" అని పిలవరు. వాటికి బదులు వేరే పేర్లు పెట్టారు.

మిగిలిన మొక్కల్లో మాదిరిగా వీటికి ఆకుపచ్చని రంగు ఉండదు. ఆకులు అంతకంటె ఉండవు. అందువల్ల సూర్యరశ్మి సహాయంతో ఇవి తమ ఆహారాన్ని తయారుచేసుకోలేవు. తమకు తాముగా ఆహారాన్ని తయారుచేసుకోలేవు కాబట్టి ఇతరుల మీద ఆధారపడతాయి. అందుకనే సేంద్రియ పదార్ధాలు అధికంగా ఉండే మట్టి నేలల్లోను, పుట్టల మీద, తోటల్లోను, ఆఖరుకు చెట్ల మీద పెరుగుతాయి. పడిపోయిన మట్టి గోడలను కూడ విడిచి పేట్టవు ఇవి.

పుట్టగొడుగుల మొక్కంతా సన్నని దారపు పోగులా ఉంటుంది. ఇది పెరిగి, నేలలో వ్యాపిస్తుంది. "యుక్త వయసు"కు రాగానే పూలు పూసినట్లుగా తెల్లటి గొడుగు వేస్తుంది.

సాధారణంగా వర్షం పడ్డతర్వాత వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో వస్తాయి. అంత తొందరగా వచ్చినా (ఆ వచ్చేది గొడుగు భాగమే) అవి రావటానికి నేల కింద ప్రయత్నం,పెరుగుదల ఎంతో ఉంటుంది.

20

కాయలు గింజలు లేని మొక్కలు

మొక్కల్లో ఒకరకమే అయినా, పుట్టగొడుగులకు ఇతర మొక్కలకు మాదిరిగా కాయలు, గింజలు ఉండవు.

ఒక మొక్క నుండి మరో మొక్క రావాలంటే గింజలు అవసరం. అంటే మొక్కల సంతానాభివృద్ధికి గింజల అవసరం ఎంతో ఉంది. ఇవి లేకుండా పుట్టగొడుగులు ఎలా వ్యాపిస్తాయి?

గింజలు చేసే పనిని పుట్టగొడుగుల్లో ‘స్ఫోరు’లనబడేవి చేస్తాయి. వీటిలోనే కాదు, ఈజాతి మొక్కలన్నిటిలోనూ ఇంతే. ‘స్ఫోరులు’ పుప్పొడి లాగ, దుమ్ము రేణువుల్లాగ ఉండి తేలికగా గాలిలో ఎగిరిపోగలవు.

మనకు కనిపించే పుట్టగొడుగుల్లో గొడుగు కింద భాగం లో ఉండే మడతల్లో తయారవుతాయి స్ఫోరులు. తయారై పక్వానికి రాగానే గాలిలోనికి వెదజల్ల బడతాయి. నేలమీదే కాదు, మరెక్కడ పడ్డా, పరిస్థితులు అనుకూలంగా ఉంటే వెంటనే మొలకెత్తుతాయి.
స్ఫోరులు మొలకెత్తినప్పుడు వాటినుండి సన్నని దారపు పోగుల్లాంటి ‘మైసీలియం’ వస్తుంది. ఈ మైసీలియమే ఈజాతి మొక్కలకు కాండం లాంటిది. అన్నీ అనుకూలంగా ఉంటే వెంటనే ఇది గొడుగుల్ని వేస్తుంది.

21


గొడుగులు వేసేవరకు అంతా నేల లోపలే జరుగుతుంది. కాబట్టే బయటకు మనకేమీ కనిపించదు. ఎమీ లేనట్టుగా అనిపించే చోట వెంటనే గొడుగులు కనిపించటంతో ఎక్కడనుండి వచ్చాయో, ఎలా వచ్చాయో తెలియక చాలమంది తికమక పడిపోతారు. వీటి వెనక ఎంత ప్రయత్నం ఉందో వారికేం తెలుసు?

ఆకాశాన్ని అంటే చెట్లు

ఆకాశాన్ని అంటుకునే అవకాశం కోసం అర్రులు చాచే చెట్లు ఎన్నో ఉన్నాయి. ఇలాటివే అమెరికాలో కేలఫోర్నియాలో చాలా కనిపిస్తాయి. ఒక్కొక్కటి350 అడుగుల ఎత్తుంటాయి. ఇంత ఎత్తు ఎదిగే సెకోయియా చెట్లు అంతటితో సంతృప్తి పడక ఇంకా పెరుగుతూనే ఉంటాయి. మూడు వందల యాభై అడుగుల ఎత్తంటే మాటలు కాదు. దాదాపు డెబ్బై ఎనభై మంది మనుషులు ఒకరి భుజాలమీద మరొకరు నిలుచుంటే చిట్ట చివర నిలుచున్న మనిషి ఆ చెట్టుచివరలు అందుకో గలడేమో!

ఇలాంటి ‘గేడికొంగల్లాంటి’ చెట్లు ఆస్ట్రేలియాలో కూడ ఉన్నాయి. అక్కడ పెరిగే యూకలిప్టసు చెట్లు మూడువందల అడుగుల పొడవన్నా ఉంటాయి.

22

ఎత్తుగా ఉండగానే సరా! పొడుక్కు తగ్గ లావు ఉండద్దూ? తగినంత లావు, లావుకు తగ్గ బలంలేకపోతే ఏమాత్రం గాలిగొట్టినా పడిపోతాయి. అంతే కాకుండ అంతపాటి చెట్లకు తగినన్ని వేళ్ళు నేలలోకి బాగా వ్యాపించి గట్టి పట్టు పట్టి ఉంచాలి.

ఉండటమైతే సరే, వాటి అవసరాలను కాస్త ఆలోచించండి. నేలలోపల ఎక్కడో పాతాళగంగ నుండి వచ్చే నీరు చెట్టు చివర చిటారు కొమ్మకు చేరాలంటే ఎంత ప్రయత్నం కావాలో, ఎంత ‘ఫోర్సు’ అవసరమో ఊహించండి. అయినా కష్టం లేనట్లే గుట్టు చప్పుడు కాకుండా జీవిస్తున్నాయి ఈచెట్లు తరతరాలుగా.

పడిపోకుండ

కరెంటు స్తంభాన్ని పాతేటప్పుడు గాలికి పడిపోకుండా ఉండటానికై దాని మొదట్లో సిమెంటుతో దిమ్మ కడతారు. దీనికి తోడుగా స్తంభం చివర్లో కట్టిన వైరును కిందకు దించి దూరంగా నేలలోకి పాతుతారు. ఇలా చేయటం వల్ల ఎంత బలంగా గాలి వీచినా స్థిరంగా ఉంటుంది స్తంభం.

ఇదే పనిని చెట్లు కూడ చేస్తుంటాయి. ఎంత బలం కలిగినదైనా, వేళ్ళు ఎంత లోతుగా ఉన్నా గట్టిగా గాలి వీచినపుడు చెట్లు నేలకొరిగే ప్రమాదం ఉంది. అందుకని కరెంటు స్తంభం పడిపోకుండా మనం ఏయే ఏర్పాట్లు చేసుకున్నామో, మొక్కలు అవే ఏర్పాట్లు చేసుకున్నాయి.

23


వీటిలో ముందుగా చెప్పుకోదగింది మఱ్ఱిచెట్టు దాని ఊడలు. మఱ్ఱిచెట్టు ఎక్కడో పుడుతుంది, కాని దాని కొమ్మలు మాత్రం ఎంతో దూరంగా వ్యాపిస్తూ ఉంటాయి. ఆ కొమ్మలకు మరికొన్ని కొమ్మలు, వాటికి ఆకులు..అలములు.., ఇలా పుట్టుకుంటూ పోయేసరికి కొమ్మ బరువెక్కిపోతుంది. బరువుకు, వీచేగాలికి అవి నేలకు వాలిపోయే అవకాశం ఉంది. అందుకని పడిపోకుండా అడ్డంగా పెరుగుతుండే కొమ్మలకు సపోర్టుకై అక్కడక్కడ ‘పోటీకఱ్ఱలను’ నిలబెడతాయి..అవే ఊడలు.

ఇలాంటి కొమ్మలనుండే ఊడలు దిగుతాయి. ఊడలనేవి ఒక ప్రత్యేక రకానికి చెందిన వేళ్ళు. వేళ్ళనేవి నేలలోకే పోవాలి కాబట్టి కొమ్మకు పుట్టినా కాని చివరకు నేలలోకే పోతాయి. నేలను చేరిన తర్వాత బాగా గట్టిపడి బలంగా తయారై కొమ్మ పడిపోకుండ సపోర్టు నిస్తాయి.

ఇంతటితోనే ఆగకుండ ఈవేళ్ళు మిగతా వేళ్ళలాగ నేలనుండి నీళ్ళని పీల్చటం మొదలు పెడతాయి. ఇందుకనే ఊడలు దిగిన మఱ్ఱి మొదలు కొట్టేసినా చచ్చిపోదు.

బాగా ముదిరిన ఊడలు కొన్నాళ్ళకు చెట్టులాగానే కనిపిస్తాయి. వీటిమూలాన కొంతకాలానికి అసలు చెట్టు మొదలు ఎక్కదుందో కూడ తెలుసుకోలేం.

కలకత్తా బొటానికల్ గార్డెన్స్ లో ఉన్న మఱ్ఱి చెట్టు

24


ఇలాగే ఉంటుంది. 170 సంవత్సరాల వయసున్న ఆచెట్టుకు దాదాపు ౬౦౦ ఊడలు ఉన్నాయి. వీటన్నిటి మధ్యన ఉండే అసలు మొదలు ఎక్కడుందో చెప్పటం కష్టం.

ఇలాంటిదే మరోరకం సపోర్టును మొక్కజొన్న మొక్కల్లో చూడవచ్చు. నేలకు కొంచం పైగానే ఉండే కణుపు వద్ద, కణుపు చుట్టూ కొన్ని వేళ్ళు వస్తాయి. చివరకు నేలలోకి దిగుతాయి. స్థిరపడిన తర్వాత వీటిమూలాన కాండం అన్నివైపులకు లాగిపట్టి ఉంచబడుతుంది. ఎటువైపూ వంగి పోకుండా ఉండటానికి వీలవుతుంది.

ఈ రకమైన యేర్పాటు సాధారణంగా బురదనేలల్లో పెరిగే మొక్కల్లో కనిపిస్తుంది. అలాంటి నేలల్లో మొక్క నిటారుగా నిలబడటానికి నేల బలం చాలదు కాబట్టి, ఈవేళ్ళ అవసరం ఎంతైనా ఉంది.

కరెంటు స్తంభం మొదట్లో కడుతుండే సిమెంటు దిమ్మలాంటి యేర్పాటు రావి,బూరుగ చెట్లలో కనిపిస్తుంది. ఈచెట్ల మొదట్లో మరీ చదరంగా దిమ్మెల్లాగ ఉండకపోయినా అలాంటిదే సపోర్టుకై వేళ్ళవలన యేర్పడుతుంది.

లావెక్కే చెట్లు

ఎంత ఎత్తుకు అంత లావు ఉంటేనే బాగుంటుంది. కాని కొన్ని

25


చెట్లు మాత్రం కొందరు మనుషుల్లాగ అడ్డంగ తెగ పెరిగిపోతాయి.

ఎక్కువగా ఆఫ్రికాలో కనిపిస్తాయి ఇలాంటి చెట్లు. డెబ్బై అడుగులు ఎత్తు పెరిగే ‘బెబిల్’ అనబడె చెట్లు 25 అడుగుల లావెక్కుతాయి.

లావెక్కటంలో వీటిని తలదన్నేవి లేకపోలేదు. 150 అడుగుల లావు ఉండే ‘ఎర్ జైగాట్’ చెట్టు మెక్సికోలో కనిపిస్తుంది. అంటే ఈచెట్టు మొదలు తొలచి (చెట్టు చచ్చిపోకుండ) ఒకేసారి నాలుగు కార్లు పోగలిగేటంత విశాలమైన రోడ్డు వేసుకోవచ్చు.

ఇంత ఎత్తు, ఇంత లావెక్కాలంటే ఎన్నేండ్లు పడుతుందో! కొన్ని తరాలు పట్టవచ్చు. వందలు వేల యేళ్లతరబడి పెరుగుతుండే చెట్లు కూడ ఉన్నాయి.

చిరంజీవులు

కోనిఫరు రకానికి చెందిన చెట్లు రెండు వేల యేండ్లు బతుకుతాయని అంచనా. అవి పుట్టిన దగ్గర నుండి చూస్తున్న వాళ్ళు కనిపించరు కాని, అవి ఐదు వందల యేళ్ళ నుండి పెరుగుతున్నట్లు దాఖలాలు చూపించే వాళ్ళు మాత్రం కనిపిస్తారు.

నాలుగు వేల యేళ్ళ నుండి పెరుగుతున్నాయనుకునే ‘సియెర్రా రెద్ ఉడ్’ లు కేలిఫోర్నియాలో కనిపిస్తాయి. వీటిలో కొన్ని కనీసం రెండు వేల యేళ్ళ నుండైనా పెరుగుతున్నట్లు తెలుస్తుంది.

26


మఱ్ఱి, రావి చెట్లు ఇలాంటివే. చిరంజీవులు. ఆటంకం లేకుండా ఉంటే అదుపు-అడ్డు లేకుండా పెరుగుతునే వుంటాయి. రెండు-మూడు వేల సంవత్సరాలు పెరగగలవని అంటున్నారు. మద్రాసు లోని అడయారు - మఱ్ఱి చెట్టు కూడా సామాన్యమైనదేం కాదు.

వింతలు - విడ్డూరాలు

చీమలతో మొక్కల స్నేహం

స్నేహానికి ఎల్లలు లేవని మనం పుస్తకాల్లో రాసుకొని చదువుకుంటుంటాం. కాని నిజానికి అపుడపుడు కొందరి విషయాల్లో భేద భావం చూపిస్తూనే ఉంటాం. కాని మొక్కలు మాత్రం తమ స్నేహానికి కుల,మత,ప్రాంతీయ తత్వాలేమీ లేవంటూ ఉదాహరణ పూర్వకంగా చూపిస్తున్నాయి.ఈ విషయంలో మనం వాటి దగ్గర నేర్చుకోవలసింది ఎంతో ఉంది.

మనిషితో సహా భూమిమీద పెరిగే జీవులన్నీ ఆహారం కోసం ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆధారపడేది మొక్కలమీదే. అందువల్ల మొక్కలకు గిరాకీ ఎక్కువ, తాకిడీ ఎక్కువే.

కొన్ని జంతువులు మొక్కల ఆకుల్ని తింటే, మరి కొన్ని జంతువులు మొక్కల దుంపల్ని, కాయల్ని తింటే, ఇంకా కొన్ని జంతువులు అసలు మొక్క మొక్కనే సమూలంగా తినేస్తాయి.

మిమ్మల్ని ఎవరైనా కొట్టటానికి వస్తే మీరు ఎదురు తిరగరూ? ఆత్మ రక్షణకు మార్గాలు వెదకరూ? అలాగే మొక్కలు కూడ, జంతువుల బారినుండి

27


తప్పించుకునేందుకై ఎన్నో ఆత్మరక్షణా మార్గాలను వెతుక్కుంటాయి. కొన్ని మొక్కలు బాకుల్లాంటి ముళ్ళను పెంచుకోగా మరి కొన్ని చేతికి చిక్కకుండా చెట్ల పైకి పారిపోతాయి. మరికొన్ని గుర్తించలేని రంగుల్తో ఎన్నో వేషాలు వేస్తాయి.

ఈ భద్రతా పద్ధతి ఎంతవరకు పోయిందంటే, వాటి శతృవులు జంతువులు కాబట్టి, అలాంటి కొన్ని జంతువులతోనే స్నేహంచేసి, వాటిని తమ శతృవులైన ఇతర జంతువుల మీదకు ఉసిగొల్పుతాయి. ఇదే కాబోలు ‘కత్తికి కత్తి’ అంటే. ‘డివైడ్ అండ్ రూల్’ (విభజించి పాలించు) సిద్ధాంతం ఇదేనేమో!

మొక్కలకు ఈ బాడీగార్డు లాగ పని చేసే జంతువులు మరేవో కావు, చీమలే. అయితే ఈచీమలు కూడ ఊరికినే తేరగా పని చేసిపేట్టవు కాబట్టి వాటికి కొంత ‘జీతం’ ఇస్తాయి, ‘లంచం’ పెడతాయి.

ఇలాంటి తెలివైన మొక్కలు ఎన్నో వున్నాయి, వాటిలో ఒకదాని పేరు చెప్పాలంటే ‘అకేషియా స్ఫీరోసెఫాలా’, దక్షిణ అమెరికాలో పెరిగే ఒక రకం తుమ్మ చెట్టు ఇది.

ఈ చెట్ల ఆకుల కాడలు కొంచెం లావుగాను, బోలుగాను ఉండి చీమలు తిరగటానికి పెరగటానికి అనుకూలంగాఉంటుంది. కష్టపడి కట్టుకోకుండా తేరగా ఇల్లు దొరుకుతుంది కాబట్టి, ఉండటానికి అద్దెకూడ లేదుకాబట్టి ఎక్కడెక్కడో ఉండే చీమలన్నీ వచ్చి వీటిలోనే ఉంటాయి.

ఉండటానికైతే సరే, మరి తినటానికి కావద్దూ?

28


ఇలా అడుగుతాయోమోననే చీమలకు ఆ మొక్కలు ‘అన్నం’ కూడ పెడతాయి. ఎలాగైనా స్నేహితులు కదా.

ఈ మొక్కల ఆకుల్లోనే ఉంటుంది చీమల ఆహారం. ఆకుల కొనల్లో తమకు అందుబాటులో ఉండే ఆహారాన్ని తింటూ చీమలు తిరుగుతుంటాయి.

ఇలా తింటూ తిరగమంటే ఎవరు ఉండరు? ఊరికే ఉండలేక విశ్వాసంకొద్దీ తమ స్నేహితుడు గారికి బాడీగార్డు పని చేస్తాయి. ఈ చెట్ల ఆకుల్ని తినటానికి జంతువులేవైనా వస్తే చీమలు తామరతంపరలుగా వచ్చి వాటి వాటిమీద పడతాయి. వీటి పోరు పడలేక వచ్చిన జంతువులు తోకముడుచుకుని తిరిగి పోతాయి.

ఇంత తెలివైనవి కాకపోయినా వీటిని చూసి కాస్త విద్య నేర్చుకున్నవే - తుమ్మ, మామిడి, నేరేడు, కంద లుచీమలను ఆకర్షిస్తాయి.

మరోరకం మొక్కయితే తాను తయారు చేసుకున్న ఆహారాన్ని దుంపల రూపేణా నేలకింద దాచిపెట్టుకుంతుంది.

దాచుకున్న దాన్ని ఎవరూ దోచుకుపోకుండా ఇలాంటి ట్రిక్ నే ప్రయోగిస్తుంది. దుంపలో ఎక్కువ భాగం తయారుచేసుకున్న ఆహారం ఉండగా కొంత భాగం మాత్రం బోలుగా ఉండి, చీమలు నివసించడానికి వీలుగా ఇల్లు మాదిరిగా ఉంటుంది. యోధుల్లాంటి చీమలు వాటిలో చేరి కాపలా కాస్తుంటాయి.

29


కన్నీళ్ళు కార్చేవి

‘బాధలు మనిషికి కాక మానుకుంటాయా’ అని అంటుంటారు. అంటే కష్టాలన్నీ మనిషికే కలుగుతుంటాయి కాని మొక్కలకు కాదు- అని అర్ధం. ఈమాటలతో మనల్ని మనం ఓదార్చుకుంటున్నామే ననిపిస్తుంది, మరో పక్క మొక్కల్ని చిన్న చూపు చూస్తున్నామా అని కూడ అనిపిస్తుంది.

మన లాగ మొక్కలు తమ కష్టాలను పక్కవారికి చెప్పుకొనక పోవచ్చునేమో కాని, అవి బాధ పడుతున్నాయనే దానికి రుజువుగా నాలుగు కన్నీటిబొట్లు మాత్రం అపుడపుడు విడుస్తుంటాయి. ఒక్క సారి మరీ నీరుకారి పోతాయి.

చలికాలంలో తెల్లవారు జామున చూస్తే టొమేటో, కంద,కొన్ని రకాల గడ్డిమొక్కల ఆకుల చివర, ఆకుల అంచుల చుట్టూ నీటిబొట్లను చూడవచ్చు.

‘రాత్రంతా బాధపడగా వచ్చేవే’ ఈ కన్నీటి బొట్లు. ఉదయభానుని తొలికిరణాలతో తళతళ మెరుస్తూ కనిపిస్తాయి,

అపుడపుడు గాలిలోని తేమకూడ ఘనీభవించి ఆకులపై బిందువులుగా యేర్పడవచ్చు. వాటికి, ఈబిందువులు యేర్పడటానికి తేడా ఉంది. మంచుతో సంబంధం లేకుండా తమంతట తామే తయారుచేసి నీళ్ళు వదిలే ఇలాంటి మొక్కలు మూడు వందలకు పైగానే ఉన్నాయి. వీటి వెనకగల బాధను, ఆకన్నీటి వెనక తతంగాన్ని చూద్దాం.

దేన్నైనా మనం అవసరానికంటె ఎక్కువే కోరుకుంటాం.

30


అలాగే మొక్కలు కూడా తమకు కావలసిన దానికంటె ఎక్కువ నీటిని నేలనుండి పీల్చుకుంటాయి.

ఎండలు బాగా ఉన్నప్పుడు, గాలిలో తేమ ఎక్కువగా లేనప్పుడు మొక్కలు అదనంగా పీల్చిన నీటినంతా ఆకుల్లోకి పత్రరంధ్రాల ద్వారా బయటకు పంపేస్తాయి. ఈపనిని భాష్పోత్సేకమని అంటారు.

ఒక వేళ వాతావరణంలో తేమగనుక ఎక్కువగా ఉంటే ఆకులనుండి నీరు త్వరగా బయటకు పోలేదు. ఇంట్లో తడి గుడ్డలు ఆరేస్తే ఎండాకాలంలో ఆరినంత తొందరగా వానాకాలంలో ఆరవు. వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటాన తడి గుడ్డలనుండి నీరు తొందరగా ఆవిరై బయటకు పోలేదు. ఇలాగే మొక్కలు పీల్చిన నీరు ఆకులనుండి తొందరగా పోలేదు.

‘బయటకు పోతే నాకేం, పోకపోతే నాకేం’ అంటూ వేళ్ళు మాత్రం తమపని తాము చేస్తూనే ఉంటాయి, దొరికినంత నీటిని పీలుస్తునే ఉంటాయి.

ఆకుల్లోకి వచ్చేనీరు వస్తూనే ఉంటుంది,బయటకు పోవలసిన నీరు మాత్రం పోకుండా ఆగిపోతుంది. ‘ట్రాఫిక్ జామ్’ కావటంతో ఏమిచేయాలో తెలియక ఇరకాటంలో పడ్డ మొక్కలు వేరే మార్గం చూసుకుంటాయి.

అటు - ఇటు పోక మధ్యే మార్గంలో ‘త్రిశంకు స్వర్గం’ లో నిలిచిపోయిన నీటిని బయటకు పంపటానికై ఈమొక్కలు తమ ఆకులకు ప్రత్యేకమైన రంధ్రాలు కొన్నిటిని యేర్పాటు చేసుకుంటాయి. మామూలుగా ఉండే పత్రరంధ్రాల నుండి నీళ్ళు ఆవిరి రూపంలో బయటకు పోగా, ఈ ప్రత్యేకమైన


31


రంధ్రాలనుండి నీళ్ళు బొట్లు-బొట్లుగా బయటకు పోతాయి. అదీ-తేడా. అందుకని వీటికి నీటిపత్రరంధ్రాలని పేరు పెట్టారు. ఆకుల్లో యేర్పడే డ్రెయినేజి సమస్యను పరిష్కరించడానికి ఇవి తోడ్పడుతుంటాయన్నమాట.

ఇలా ఆకులనుండి బయటకు వచ్చేనీరు రోజుకు చిన్న చిన్న బొట్లనుండి దాదాపు లీటరులో పదోవంతుదాక ఉంటుంది.

ఇప్పుడడగండి- అవి ‘కన్నీటి బొట్లేనా’ అని. బహుశ ‘ఆనంద భాష్పాలని’ అంటాయేమో!


సిగ్గు పడిపోయే మొక్కలు

తాకితేనే సిగ్గుపడి తలలు దించేసుకునే మొక్కలున్నాయి. అవి అంతగా సిగ్గుపడటానికి కారణాలు తెలియవు కాని, ఎలా సిగ్గు పడతాయో మాత్రం తెలుస్తుంది.

ఈ రకం మొక్కల్లో అత్తపత్తి ముందుగా నిలుస్తుంది. దీనినే ‘టచ్-మి-నాట్’ అనికూడ పిలుస్తారు. ‘నన్నంటుకోకే...’ అనే ఈ మొక్క మన స్పర్శ తగిలితే- అంతదాక ఎందుకు, మన గాలి సోకినా వెంటనే తలలు దించేసుకుంటుంది, ఆకుల్ని వంచేసుకుంటుంది.

‘సిగ్గు మూలననే ఇదంతా’ అని మనం అనుకుంటుంటే కాదు, ‘సిగ్గు-బిడియం లేని ఈ మొక్కలకు ఇదంతా ఆత్మరక్షణకై ఒక పద్ధతి’ అని శాస్త్రజ్ఞులు చెపుతారు.

32


పులి వెంట పడ్డప్పుడు లేడి ఎదురు తిరిగి పోత్లాడదు; కాలికి బుద్ధి చెపుతుంది; వాయువేగంతో పరుగెడుతుంది. కొంపలు మునిగిపోయేటంతటి ప్రమాదం వచ్చినపుడు మొక్కలు కూడా అంతే. అయితే నేలలో పాతుకుపోయాయి కాబట్టి పరుగెత్తలేవు. అందుకని ఆత్మరక్షణకై వేరే పద్ధతులు చూసుకుంటాయి. వాటిలో ఒకటి- కొమ్మలు,రెమ్మలు, ఆకులు ముడుచుకోవడం.

మన చేయి తగిలినా, నడిచేటపుడు కాలు తగిలినా, పెద్ద శబ్దం వినిపించినా, వేడి సోకినా వెంటనే ఈ మొక్కల్లో రియాక్షను కనిపిస్తుంది. అంటే ఆకులు ముడుచుకు పోతాయి. కొమ్మలు కిందికి వాలిపోతాయి. మరీ పెద్ద ప్రమాదం కలుగుతుందంటే ఈ ప్రతిచర్యకూడ దానికి తగినట్లే వేగంగాను వెంటనే జరుగుతుంది.

మిగిలిన మొక్కల్లో కనిపించని ఈ ప్రతిచర్య వీటిలో ఇంత వేగంగాను సమర్ధవంతంగాను ఎలా జరుగుతుంది? ఇది చాల ఆసక్తికరమైన విషయం. ఎలా జరుగుతుందో చాలమట్టుకు శాస్త్రజ్ఞులు తేల్చివేశారు. అదెలాగో చూద్దాం.

ఈమొక్కల్లో ఆకులు కాండానికి అంటుకుని ఉండే కాడ భాగం కొంచెం లావుగా ఉంటుంది. ఆకుల్ని కదిలించే శక్తి, కీలకం అంతా ఈ లావుపాటి భాగంలోనే ఉంటుంది.

33


లావుపాటి ఈభాగంలో కాండానికి దగ్గరగా కనిపించే పైభాగాన్ని ‘ఎ’ అని పిలుద్దాం., కిందకి నేలవైపుకు ఉండే భాగాని ‘బి’ అని అనుకుందాం.

మిగిలిన మొక్కల్లో లాగానే ఈ ‘ఎ’, ‘బి’ భాగాలు కూడ చిన్న చిన్న కణాలచేత నిర్మించబడి ఉంటాయి. ‘బి’- భాగంలో ఉండే కణాలు కాస్త నీరసపడి పోయాయంటే ఆకు నిలబడలేక వాలిపోతుంది. మరల ఆకణాలు శక్తిని పుంజుకున్నాయంటే వాలిపోయిన ఆకు లేచి నిలబడగలుగుతుంది. సూక్ష్మంగా చెప్పాలంటే ఇంతే. దీనినే ఇంకా వివరిస్తే

కణాలు నీరసపడిపోయినట్లు, శక్తిని పుంజుకున్నట్లుగా పనిచేస్తాయే కాని, నిజానికి నీరసపడీ పోవు, శక్తినీ పుంజుకోవు.

రబ్బరు బెలూనులోకి గాలిని ఊదామనుకోండి, లావెక్కుతుంది. బెలూను చుట్టూ రబ్బరుపొర మీద గాలి పీడనం - అంటే వత్తిడి కలుగుతుంది. గాలి తీసేస్తే పీడనం తగ్గిపోతుంది.

అలాగే ఈ మొక్కల్లో ఈకణాలలో నీరు బాగా చేరితే, కణాల గోడలమీద కలిగే పీడనం పేరుగుతుంది. నీరు బయటకు పోతే పీడనం తగ్గుతుంది. పీడనం పెరగటమే పైన చెప్పిన ‘శక్తిని పుంజుకోవటం’, పీడనం తగ్గటమే ‘నీరసపడిపోవటం’.

ఈ విధంగా ఆకు మొదట్లో ఉండే కణాలలో చేరే నీటినిబట్టి కలిగే పీడనంలో మార్పు రావటాన ఆకులు ముడుచుకుపోవటం లేదా

34


మామూలుగా రావటం జరుగుతుంది. ప్రమాదాన్ని సూచించే సంకేతాన్ని బట్టి కణాలలో నీటి రాకపోకలు ఆధారపడి ఉంటాయి. ఇదెలాజరుగుతుందనేది మాత్ర్ం ఇంకా అర్ధం కాలేదు శాస్త్రవేత్తలకే.

తల్లి ప్రేమ

కుంతీ దేవి కర్ణుణ్ణి కని,పరిస్థితుల ప్రభావం వల్ల ‘నీకూ నాకూ సంబంధం లేదని’ అంటూ ఒక తొట్టెలో పెట్టి నీటిలో వదులుతుంది. పక్షులున్నాయంటే గుడ్లుపెట్టటం వరకే వాటి ముఖ్యవిధి. చాల పక్షులు గుడ్లను పొదిగి పిల్లల్ని చేసినా, పొదిగి పిల్లల్ని చేయని పక్షులు చాల ఉన్నాయి.

చాల వరకు మొక్కలు చేసే పనీ ఇదే. గింజల్ని తయారుచేసి ‘పెరిగి మామాదిరిగా పెద్దయితే అవ్వండి, లేకపోతే మీఖర్మ’ అని వదిలేస్తాయి.

కాని కొన్ని మొక్కల్లో మాత్రం అసలైన మాతృప్రేమను చూడవచ్చు. బురద నేలల్లోను, ఉప్పు భూముల్లోను పెరిగే అవిసీనియా లాంటి చెట్ల విషయంలో ఇది మరీ కనిపిస్తుంది. నేలమీద ఇన్ని మొక్కలు పెరుగుతుండగా బురదనేలల్లో పెరిగే ఈ మొక్కలకే అంతపాటి ప్రేమ ఎలా పుట్టుకొచ్చిందా అని అడగవచ్చు, దానికీ ఒక కారణం ఉంది.

బెంగాలులోని సుందరవనాల్లో ( సుందరవనాలంటే ఏవో అని అనుకునేరు-బురద భూములే) పెరిగే ఈ మొక్కకు ఇదొక ‘ద్యూటీ’యే.

35

మామూలు మొక్కల మాదిరిగానే ఇవికూడ గింజల్ని తయారుచేసుకుంటాయి. వాటి మాదిరిగానే ఇవి కూడ తమ గింజల్ని ‘మీఖర్మ’ అంటూ వదిలేస్తే ఆగింజలు కాస్తా కింద ఉండే బురద రొచ్చులో పడి పోతాయి. అధ్వాన్నంగా ఉండే ఆనేలమీద పడ్డ ఏగింజా మొలకెత్తలేదు. చచ్చి ఊరుకుంటుంది.

అందుకని జాలి తలచి ఈమొక్కలు తమగింజల్ని తమతోపాటు (అంటే-చెట్టు మీద ఉండగనే) ఉన్నపుడే మొలకలు వేయించి కాస్త పెరిగిన తర్వాత ‘ఇక బురద నీళ్ళల్లో పడేసినా పర్వాలేదు, వాటంతట అవే పెరగగలవని’ నమ్మకం కుదిరిన తర్వాత మాత్రమే వదిలేస్తాయి.

ఈవిధంగా గింజలు చెట్టు మీద ఉండగానే, చెట్టుతో సంబంధం ఉన్నపుడే మొలకెత్తటమనేది అరుదు. ఇలాంటిది అన్ని మొక్కల్లో చూడం.

ఈచెట్టు పూలు కాయలుగా మారినతర్వాత కాయలు బాగా ముదిరి గింజలు కడతాయి. చెట్టుమీదే ఆగింజలు మొలకెత్తటం ప్రారంభమవుతుంది. మొలకెత్తిన గింజ జానెడు పొడవు పెరిగే దాక తల్లి చెట్టుతో సంబంధం ఉంటుంది. ఆతర్వాత బంధాన్ని తెంచుకుని నేలమీద- అంటే కిందుండే బురదనీటిలో పడిపోతుంది.

ఆ పడటంలో కూడ విశేషం ఉంది. మొలకెత్తిన గింజలో వేళ్ళుగా పెరగబోయే భాగమే ముందుగా నీళ్ళలో పడుతుంది. ఎలాంటి పరిస్థితుల్లోను కాండంగా పెరగబోయే భాగం నీళ్ళల్లో మునిగేలా పడదు.

36

దీనికొక కారణం ఉంది. మీరు ‘షటిల్ కాక్’ ఆడే ఉంటారు. లేదా కనీసం చూసైనా ఉంటారు. కాక్ నేలమీద పడేటపుడు ఎప్పుడూ బరువుగా ఉండే దాని డిప్ప భాగమే కిందికి ఉంటుంది. ఈకల భాగం తేలికగా ఉండటాన పైకే ఉంటుంది.

ఇదే విధంగా బురద నీటిలో పడబోయే పిల్లమొక్క వేరుగా పెరగబోయే భాగం బరువుగా ఉండటంతో అదిమాత్రమే నీటిలో పడుతుంది. కాండంగా పెరగబోయే భాగం మాత్రం నీళ్ళల్లో పడ్డా నీటిపైనే తేలుతూ ఉంటుంది. ఆతర్వాత ఆధారం దొరకగానే క్రమక్రమంగా వేరుతన్ని స్థిరపడుతుంది.

ఈరకంగా చెట్టుమీద ఉండగానే గింజలు మొలకెత్తటాన్ని ‘వివిపేరీ’ అంటారు. తేమగా వున్నపుడు, బాగా వర్షాలు పడ్డపుడు వరిపంటను పరిశీలిస్తే ఇదే కనిపించవచ్చు. కంకిమీద గింజలు మొలకెత్తటం చూడవచ్చు. అలాగే బొప్పాయి.

పాలిచ్చే మొక్కలు

ఇన్ని వ్యవహారాలు చేసే మొక్కల్లో పాలిచ్చేవికూడ లేకపోలేదు. అయితే ఈ పాలివ్వటం వాటి పిల్లల్ని పోషించటానికి కాదు. తమను తాము పోషించుకోటానికి, రక్షించుకోటానికి.

మొక్కలంటె చాలజంతువులకు ఇష్టమైన ఆహారం కాబట్టి తినేస్తాయేమోనని, వాటికి అయిష్టం కలగ జేయటానికి గాను కొన్ని మొక్కలు తెల్లటి పాలను తయారు చేసుకుంటాయి.

37

‘తెల్లనివన్నీ పాలని’ అనుకోకూడదని చెపుతారు కదూ. ఇవీ అంతే. తెల్లగా పాలలాగ ఉంటాయి కాని పాలు మాత్రం కాదు. మొక్కల్లో దాదాపు అన్ని భాగాలకు వ్యాపించి ఉండే ఈపాలు ఏ ఆకును కోసినా, ఏ కొమ్మను గిల్లినా వెంటనే జలజల కారతాయి.

గన్నేరు,జిల్లేడు,సపోటా,బొప్పాయి, రబ్బరు చెట్లు, వీటికి ఉన్న ‘చుట్టాల మొక్క’ లన్నీ ఇలా పాలు కార్చేవే.

గమ్మత్తేమిటంటే ఏ పాలవల్ల ఎవ్వరూ తమజోలికి రారని అనుకుంటాయో, ఆపాల కోసమే మనం వాటి జోలికి పోతాం. ఆ చెట్లకు గంట్లువేస్తాం. పాలు పడతాం. రబ్బరుచెట్లు,బొప్పాయిచెట్ల ఒంటినిండా ‘తూట్లు పొడిచి’ మరీ పట్టుకుంటారు పాలు. వీటిని నమ్ముకుని ఎన్నో పరిశ్రమలు నడుస్తున్నాయి కూడా. ఉన్న చెట్లు చాలకపోవటంతో మరెన్నో నాటి పోషిస్తున్నారు.

జిల్లేడు,గన్నేరు,పాలను మందులు-మాకుల్లోకి వాడగా, సపోటా పాలనుండి చ్యూయింగ్ గమ్ ను, రబ్బరుపాలనుండి రబ్బరును తయారుచేస్తారు.

మనకు లేచిన దగ్గరనుండి రబ్బరుతో ఎన్నో పనులున్నాయి. ఆ రబ్బరును ప్రసాదించే చెట్ల గురించి చూద్దాం.

ప్రపంచంలో ప్రస్తుతం తయారయ్యే రబ్బరులో ఎనభై శాతాన్ని ‘హెవియా’ చెట్లనుండి తీస్తారు. మనదేశంలో ఐతే ఈపనికి మరో రకం రబ్బరు చెట్లున్నాయి. మఱ్ఱి చెట్టు రకానికి చెందినదాన్నే మనం సాధారణంగా పెంచేది.
రబ్బరుచెట్టును ఎక్కడ గిల్లినా, గోకినా పాలు కారవచ్చు.

38

అయితే కాండం మొదట్లొ నుండి తీసిన పాలకే ఎక్కువ విలువ ఉంది. వీటిలో ఎన్నో పదార్ధాలు కలగలిసి ఉంటాయి.

అసలు పాలను ఈచెట్లు ఎందుకు తయారుచేసుకుంటున్నట్లు? తనకు గాయాలు తగిలితే తొందరగా మాన్చుకోటానికనీ, ఆత్మరక్షణకు గాను కొంతవరకు ఉపయోగపడుతుందని, లోపల పదార్ధాలను ఒకచోట నుండి మరోచోటకు చేరవేయటానికి తోడ్పడుతుందని- ఇలా ఎన్నో రకాలుగా ఊహిస్తున్నారు. ఏది ఏమైనా మనకు మాత్రం ఎంతోబాగ ఉపయోగపడుతున్నాయి.

కనీసం రెండువందల యేండ్లు బతుకుతుంది రబ్బరు చెట్టు. అరవై నుండి నూటనలభై అడుగుల ఎత్తు ఎదుగుతుంది. ఇంత ఎత్తు ఎదిగినా పాలుతీసేది మాత్రం నేలమీద కొన్ని అడుగుల ఎత్తుదాకనే.

సాధారణంగా నేలమట్టానికి మూడడుగుల ఎత్తున చెట్టు కాండానికి `V' - ఆకారంలో గాట్లు ఒకదానిమీద మరొకటి వేస్తారు. మరీ లోతుగా వెయ్యరు. వేస్తే ఎంతపెద్ద చెట్టయినా చచ్చి ఊరుకుంటుంది. గాట్లు పెట్టిన కొన్ని గంటల వరకు పాలు కారతానే ఉంటాయి. వీటిని పట్టుకునేటందుకై కింద కప్పులను పెడతారు. పాలు కారటం ఆగిపోయిన తర్వాత వేసిన గాట్ల కిందనే మరికొన్ని వేస్తారు. పట్టిన పాలను గడ్డ కట్టించి, కొన్ని రసాయనిక పదార్ధాలను కలిపి రబ్బరును తయారు చేస్తారు.

చ్యుయింగ్ గమ్ ను తయారుచేసేది సపోటా పాలతోనే. సపోటా చెట్టు మరీ పెద్దదైతే 30 అడుగుల ఎత్తుదాక కాండానికి గంట్లు పెడతారు. రబ్బరు పాలను పట్టుకున్నట్లే వీటినీ పట్టుకుంటారు. తర్వాత వాటిని శుద్ధిచేసి

39

కావలసిన రసాయనాలు కలిపి, రుచికి పంచదారను, వాసనకు ‘ఎసెన్సు’ ను కలిపి చ్యుయింగ్ గమ్ ను తయారు చేస్తారు.

ఈవరసలో వచ్చేయే బొప్పాయి పాలు. బొప్పాయి పాలలో ‘పపాయిన్’ అనబడే ఒక ‘ఎంజైము’ ఉంటుంది. మాంసకృత్తులను జీర్ణం చేసే గుణం దీనికి ఉండటంతో దీనిని కొన్ని మందులకు, రసాయనాలు, ఆహారం తయారు చేయటానికి వాడతారు.

పచ్చిబొప్పాయి కాయలపైన సన్నగా, అంతగా లోతుకు దిగకుండా గీతలు గీస్తారు. వాటినుండి కారే పాలను జాగ్రత్తగా పట్టి ఎండబెడతారు. సపోటా,రబ్బరు పాలమాదిరిగా మరగించరు. చివరకు పొడిలా తయారవుతుంది.

ఈవిధంగా మొక్కలు వాటికోసం తయారుచేసుకునే పాలు మన పాలబడి ఎంతో ఉపయోగ పడుతున్నాయి.

స్నేహం, ఇచ్చిపుచ్చుకొనటాలు

ఒకరినొకరు అర్ధం చేసుకొనటానికి స్నేహం ఏర్పడుతుంది, ఇచ్చి పుచ్చుకొనటాలు మొదలవుతాయి. ఇదంతా మనలో.

ఇలాంటిది నోరులేని మొక్కలమధ్య కూడ ఉందంటే ఆశ్చర్యమే కదా. పైగా అదీ రకరకాల మొక్కల మధ్య.

వేరుసెనగ, చిక్కుడు లాంటివి ఈపనిచేసేవే. ఇవి స్నేహం చేసేది వాటి ఈడు-జోడుకు తగిన మొక్కలతో కాదు. కంటికి కూడ కనిపించనంతటి చిన్న వాటితో. ఏనుగకు, ఎలుకకు కుదిరినట్లుంటుంది వీటి స్నేహం .

40

తనకంటె చిన్నవి కదా అని ఈమొక్కలు తన స్నేహితులపై చిన్న చూపు చూడవు, అజమాయిషి చెయ్యవు. ఎందుకంటె వాటికి ఇవెంత సహాయం చేస్తాయో,వీటికి అవే అంత సహాయం చేస్తాయి.

మొక్కలు నీరు, ఎండ, గాలి మూలాన తమ ఆహారాన్ని తామే చేసుకుంటాయని తెలుసుకున్నాం. తయారయ్యేది పిండిపదార్ధం. కాని పిండిపదార్ధం ఒక్కదానితో తీరదు వీటి ఆకలి. పని చెయ్యటానికి కావలసిన శక్తిని మాత్రమే ఇస్తుంది పిండిపదార్ధం. శారీర నిర్మాణానికి మరొక పదార్ధం కావలసి ఉంటుంది. అది-నత్రజని.

సాధారణంగా నత్రజని నేలనుండి లభ్యమవుతుంది. పంటలు బాగా పండటానికే ఎరువులు వేస్తాం. ఎరువులు ఏవో కావు- నత్రజనితో కలిపిన మరికొన్ని రసాయనాలు.

నత్రజని విషయంలో రెండు సమస్యలున్నాయి. అన్ని మొక్కలకు నత్రజని నేలనుండే రావాలి. నేలమీదే ఎక్కువ మొక్కలు పెరుగుతుంటాయి. కాబట్టి వాటి మధ్య చాల పోటీ ఉంటుంది. కొన్ని నేలల్లో నత్రజని తక్కువగా ఉంటుంది. అలాంటి నేలల్లో మొక్కలు పెరగాలంటే సమస్యే.

ఈసమస్యలు వస్తాయనే వేరుసెనగ, చిక్కుడు లాంటి మొక్కలు తెలివైన పద్ధతిని అవలంబిస్తాయి. ఈ పద్ధతి ప్రకారం చుట్టూ ఎన్ని చెట్లున్నా తమకు కావలసిన నత్రజనికి లోపం జరగదు. నేలలో నత్రజని తక్కువగా ఉన్నా ఇవి మాత్రం హాయిగా బతకగలవు. అదేమిటో చూద్దాం.

41

నత్రజని నేలలోనే కాకుండ గాలిలో కూడ లభిస్తుంది. అయితే వాయురూపంలో ఉండే ఈ నత్రజనిని మొక్కలు ఉపయోగించుకోలేవు. ఉపయోగించుకొనటానికి తగిన యేర్పాట్లు ఏమొక్కకూ లేవు. అందువల్ల ఇది వాటికి నిరుపయోగం.

పెద్ద పెద్ద జీవులేవీ చేయలేని ఈపనిని సూక్ష్మజీవులు- బాక్టీరియా చేయగలవు. ఈ రహస్యం తెలిసిన కొన్ని మొక్కలు బాక్టీరియాతో స్నేహం చేసి నేరుగా గాలిలోనుండే నత్రజనిని ఉపయోగించుకుంటాయి.

ఇలాంటి బాక్టీరియాకు ఉదాహరణ ‘బాసిల్లస్’ అనబడేది. దీనిని వేరుసెనగ,చిక్కుడు,పిల్లిపెసర లాంటి మొక్కలు ఉపయోగించుకుంటాయి.

అందుకనే చిక్కుడు,వేరుసెనగ మొక్కల వేళ్ళకు చిన్న చిన్నబుడిపెల్లాంటివి ఉంటాయి. వాటినే ‘వేరు కంతులు’ అని పిలుస్తారు. లక్షలాది బాక్టీరియా కట్టుకునే గూళ్ళే ఈ వేరు కంతులు.

వేరు కంతుల్లో ఉండే బాక్టీరియా గాలి నుండి నత్రజని వాయువును తీసుకుని వేళ్ళకు ఉపయోగపడే పద్ధతిలో అందిస్తాయి. వేరేవిధంగా నేలనుండి నత్రజనిని పీల్చుకోనవసరం లేకుండ దీనినే వాడుకుంటాయి.

బాక్టీరియా ఊరకే సహాయం చేస్తాయా? ప్రతిఫలం కూడ తీసుకుంటాయి. తమకు కావలసిన ఆహారం మొక్కనుండి తీసుకుంటాయి. అసలు ఆమొక్కే పెడుతుంది తినమని.

ఒకరికొకరు సహాయపడుతూ ఈలా కాలక్షేపం చేస్తుంటాయి.

42


కొవ్వెక్కినవి కూడ ఉన్నాయి

మొక్కలన్నీ స్వతహాగా మంచివే. అయితే వాటి మధ్య కొవ్వెక్కినవి కూడ కాసిని లేకపోలేదు. విశేషమేమిటంటే మిగతా ఎన్నో మొక్కలకంటె ఈ మొక్కలు కొవ్వెక్కినా ఎంతగానో ఉపయోగపడతాయి.

కొబ్బరి,వేరుసెనగ, ఆముదం,పత్తి లాంటి కొవ్వు పట్టిన (నూనె కూడ) మొక్కలు ఎన్నో ఉన్నాయి. ఆ పట్టిన కొవ్వు ( కొవ్వుకు నూనెకు ఆటె పెద్ద తేడా లేదు. పేరుకునే నూనెనే కొవ్వు అని పిలుస్తారు) వాటి కెంత ఉపయోగపడుతుందో అంతకంటె ఎక్కువ ఉపయోగపడుతుంది మనకు.

మన శరీరంలో ఖర్చు కాకుండ మిగిలిపోయేదంతా కొవ్వు రూపేణా పేరుకుంటుంది. తర్వాత అవసరాలకు అది వినియోగించబడుతుంది. ఇలాగే మొక్కల్లో కూడ.

సాధారణంగా కొవ్వంతా గింజల్లో నిలువ ఉంటుంది. గింజలు మొలకెత్తటానికి శక్తి కావాలి కదా. అవి తమంతట తామే శక్తిని వేరే పద్ధతిలో తెచ్చుకోలేవు కాబట్టి ఆ లోపాన్ని ఈవిధంగా తీర్చుకుంటాయి. అంటే మొలకెత్తేటపుడు వాటి అవసరానికై ఉంచబడిన దాపుడు శక్తే - ఈ నూనెలు. గింజల్లో ఎక్కువే ఉన్నా, మిగతా భాగాలైన కాయలు,దుంపలు,కాండంలో కూడ నిలువనూనెలు ఉంటాయి.

కొబ్బరినుండి 70-80 శాతం దాక నూనె వస్తుంది. ఆముదపు గింజల్లో 55శాతం దాక లభిస్తుంది. ఇదే విధంగా మన వాడకానికై నూనెలను

43

ఆవాలు,మెంతులు,సోయా చిక్కుళ్ళు, పొద్దుతిరుగుడు,వేపగింజలనుండి తీస్తారు. ప్రపంచంలో నేడు నూనె అవసరాలు ఎంతగా పెరిగి
పోయాయంటె ,దొరికేది చాలక తినేసిన మామిడికాయల నుండి కూడ తీస్తున్నారు-ఎండబెట్టిన మామిడి టెంకెల నుండి నూనెలను తీస్తున్నారు.

నాన్-వెజిటేరియన్ మొక్కలు

ఆహారపు అలవాట్లను బట్టి మనలో రెండురకాల వారున్నారు-శాకాహారులు,మాంసాహారులు. మాంసం తింటే తప్పని, కేవలం ఆకులు-అలములు మాత్రమే తిని కొందరు బతుకుతుంటే, వారు తినే ఆ ‘ఆకులు-అలములే’ - అంటే కొన్ని మొక్కలు మాత్రం మాంసమే తిని బతుకుతుంటాయి.

బహుశః ఇంగ్లీషు సినిమాల్లో చూసే ఉంటారు.కొన్ని భయంకరమైన ‘రాక్షస మొక్కలు’ తమ చేతుల్లాంటి, చేంతాళ్ళాంటి ఊడలతోపెద్ద పెద్ద జంతువుల్ని, ఆఖరుకు మనుషుల్తో సహా అందరిని అమాంతం పట్టి చంపుకుతినటం. ఇవన్నీ అందంగా చెప్పే కల్పితాలు,అబద్ధాలే. అయినా ఈరకమైన ఆలోచనలకు మూలమైన ప్రక్రియలు మాత్రం కొన్ని మొక్కల్లో లేకపోలేదు.

ధర్మపరాయణులు,శాకాహారులకు నిలయమని అనాదిగా పేరుపొందిన భారతదేశంలో కూడ ఇవి కనిపిస్తాయి.

44


‘పరాపకారార్ధమిదం శరీరం’ అంటూ (పరోపకారాన్ని వదిలేసి) బతికే ఇలాంటి మొక్కల పేర్లు కొన్ని చెప్పాలంటే - డ్రాసిరా,నెపంధిస్,డయోనియా, వగైరా. వీటిలో మచ్చుకు నెపంధిస్ ను తీసుకుందాం. దీనినే కూజా మొక్క అని కూడ పిలుస్తారు.

కూజా మొక్కకు పొడుగుపాటి ఆకులుంటాయి. ఆ ఆకుల చివర భాగం కూజాలాగ మార్పుచెంది ఉంటుంది. ఆకు చాల పొడవుగా ఉండి, చివర్లో సన్నని కాడలాగ ఉండటంచేత, దాని చివర్లో అంటుకుని ఉండే కూజా గాలికి అటు-ఇటు ఊగుతూ ఉంటుంది.

అంగుళం నుండి ఆరంగుళాలు పొడవుండే ఈ కూజాకు మూతలాంటిది కూడ ఉంటుంది. మూతలాగానే కనిపించినా ఇది మూతవేయటానికి ఉపయోగపడదు. అయితే రంగురంగులతో ముస్తాబు చేసుకుని కీటకాలను ఆకర్షిస్తూ ఆహారసంపాదనకు ‘ఎర’లాగ పనిచేస్తుంది.

ఈ మొక్కల ఆహారమైన కీటకాలను పట్టుకొనటానికి, పట్టుకొన్నది జారిపోకుండ ఉండటానికి ఎన్నో ఏర్పాట్లున్నాయి. కూజా లోపలవైపు గోడ మీద కిందకి వంగినవి, పట్టుకుంటే జారిపోయే పట్టులాంటి ‘వెండ్రుక’ లెన్నో ఉంటాయి. ఇవి ఇలా ఉండటం వల్లనే కూజాలో పడిన పురుగులు ఒకసారి లోపలికిపోతే మళ్ళీ తిరిగి రాలేవు.

45


అలాగే లోపలి గోడచుట్టూ ఉండే ఎన్నో గ్రంధుల నుండి కొన్ని ప్రత్యేక రసాయనాలు విడుదలవుతుంటాయి. ఇవి కీటకాలబారి విషపదార్ధాలు. కూజాలోపల పడ్డ కీటకం ఈ పదార్ధాల చేత ముందుగా చంపబడి ఆతర్వాత జీర్ణం చేయబడుతుంది.

నాన్-వెజటేరియన్ మొక్కలన్నిటిలోను ఇలాంటి యేర్పాట్లే ఉండవు. ప్రతి మొక్క తనకు తోచిన పద్ధతిలో యేర్పాట్లను చేసుకుంటుంది.

ఇదే రకానికి చెందిన మరొక ‘గూండా’ మొక్కకయితే చిన్న చిన్న వేళ్ళ లాంటివి ఉంటాయి. ఏదైనా కీటకం దాని దగ్గరకు చేరిందంటే వెంటనే తన ‘వేళ్ళ’తో పట్టుకొని, బంధించి మెల్లమెల్లగా తినేస్తుంది.

ఏదో గాలి - నీరు పీల్చుకొని బతకవలసిన ఈ మొక్కలు ఇలాంటి దారుణాలకు సిద్ధపడటమేమిటని అడగవచ్చు. ఇదే ప్రశ్న వాటికి వేస్తే సరిగ్గానే సమాధానం చెపుతాయి.

సాధారణంగా ఇలాంటి మొక్కలు నత్రజని తక్కువగా ఉండే నేలమీద కనిపిస్తాయి. అందుకని తమకు కావలసిన నత్రజని నేలలో దొరకదు కాబట్టి వేరే మార్గం చూసుకోవాలి కదా- ‘అందుకని ఇలా చేస్తున్నామని’ అంటాయి. ఎలా ఊంది సంజాయిషీ!

46


మొక్కలు చేసుకునే వంట - వార్పు

తమ ‘అన్నాన్ని తామే వండుకుంటాయి’ మొక్కలు. సరిగ్గా చెప్పాలంటే తమ ఆహారాన్ని తామే తయారుచేసుకుంటాయి. ఇలాంటి వ్యవహారమంతా మనకైతే మన వంటింట్లో జరుగుతుంది. మొక్కల్లో అయితే వాటి ‘వంటిల్లు’ వాటి ఆకుల్లో ఉంటుంది.

అయితే మనం అన్నం వండుకోటానికి, మొక్కలు వండుకోటానికి ఒక ముఖ్యమైన తేడా ఉంది. బియ్యం, పప్పులు-ఉప్పు తెచ్చుకుని మనం వండుకుంటాం. వీటిలో దేనినీ మనకు మనంగా సృష్టించలేం. మొక్కలైతే నీరు,గాలి మూలాన ఎండలో తమ ఆహారాన్ని సృష్టించుకుంటాయి.

ఎండలో ఇలా ఆహారాన్ని తయారుచేసుకోగల శక్తి ఒక్క మొక్కలకు మాత్రమే ఉంది, భూమిమీద ఏ ఇతర జీవులకు లేదు. ఆఖరుకు బుద్ధిజీవులమైన మనకు కూడ లేదు.

ఎండ ఉన్నంత సేపు ఆకుల్లో ఆహారం తయారవుతుంది. అందుకే ఒక్కొక్క ఆకును ఒక్కొక్క ఫ్యాక్టరీతో పోల్చవచ్చు.

ఎండమూలాన ఆకుల్లో ఆహారం తయారుకావటాన్ని కిరణజన్యసంయోగక్రియ అని అంటారు. సృష్టిలో ఎంతొ ప్రాముఖ్యతగల ఇది ఎలా జరుగుతుందో, దీని ప్రత్యేకత ఏమిటో చూద్దాం.

47


కిరణజన్య సంయోగక్రియ జరగటానికి, అంటే ఆకుల్లో ఆహారం తయారు కావటానికి కావలసిన ముడిపదార్ధాలు - ఎండ,గాలి అంటే అందులోని కార్బన్ డయాక్సైడు, నీరు, పత్రఃహరితం అంటే ఆకుల్లో ఉండే పచ్చరంగు పదార్ధం.

జరిగేదేమిటంటే సూర్యరశ్మి వలన వెలువడే శక్తికి ఆకుల్లో ఉండే పత్రహరితం లోని అణువుల్లో కొన్ని మార్పులు జరుగుతాయి. ఈ మార్పు చెందిన సమయంలో మొక్కలు పీల్చిన నీరు హైడ్రొజను-ఆక్సిజనులుగా విడగొట్ట బడుతుంది. ఈ రెండిటిలో ఆహారం తయారీకి కావలసింది హైడ్రొజను మాత్రమే.

గాలిలోనుండి తీసుకోబడ్డ కార్బన్ డయాక్సైడు లోని కార్బను, ఈ హైడ్రొజనులు కలసి కార్బోహైడ్రేటు తయారవుతుంది. ఈ కార్బోహైడ్రేటే పిండిపదార్ధం.

ఫ్యాక్టరీలకు సెలవు ఉండవచ్చు. ఫ్యాక్టరీల మాదిరిగా పనిచేసే ఆకులకు మాత్రం సెలవు ఉండదు. అయితే ఒక షిఫ్ట్ మాత్రమే జరుగుతుంది. అంటే ఎండ ఉన్నపుడు మాత్రమే. తగినంత వెలుతురును కృత్రిమంగా ఇస్తే ‘రాత్రిపూట’ ‘ఓవర్ టైం’ పని చేయటానికి వెనకాడవు. వీటిని ఫ్యాక్టరీలతో పోలిస్తే:
ఫ్యాక్టరీ ................................ఆకుల్లో జరిగే పని
ఫ్యాక్టరీ స్థలం.........................పచ్చటి ఆకులు
ముడి పదార్ధం.......................గాలిలోని కార్బన్ డయాక్సైడు, నీరు
యంత్రాలు............................పత్రహరితం లోని అణువులు
కరెంటు.................................వెలుతురు(సూర్యరశ్మి)
తయారయ్యే వస్తువు..............పిండి పదార్ధం
దానికి తోడు తయారయ్యేది.....ఆక్సిజను

48


అన్నీ అనుకూలంగా ఉంటే ఒక చదరపు గజం వైశాల్యం ఉన్న స్థలంలో ఉండే ఆకులు గంటకు ఒక గ్రాము ఆహారం (పిండిపదార్ధం) తయారు చేస్తాయి. ఒకగ్రాము అంటే ‘ఆ-ఒక్కగ్రామేనా’ అని అదేదో చిన్న మొత్తంగా భావించేరు-?ఇదేం తక్కువైనది కాదు.

రోజుకు ఎనిమిది గంటలు చొప్పున పనిచేస్తే మూడునెలల్లో దాదాపు ఒక కిలో ఆహారం తయారవుతుంది. ఒక్కొక్క చెట్టుకు ఎన్నో వేలు, లక్షల్లో ఆకులు ఉంటాయి కాబట్టి అవన్నీ ఎండ ఉన్నంత సేపూ విసుగు-విరామం లేకుండ పనిచేస్తూ ఉంటాయి కాబట్టి మొత్తంమీద ఎంతో తయారవుతుంది.

ఒక పెద్ద చెట్టుకు ఉండే ఆకులన్నీ తుంచి, నేలమీద ఒకదాని పక్కన మరొకటి పరిస్తే అర ఎకరం నేల చాలదు. అర ఎకరం విస్తీర్ణం ఉండే ఈ ఆకులన్నీ ఒక రుతువులోనే 1800 కిలోల పిండిపదార్ధాన్ని తయారు చేయగలవు. అంటే ఒక చెట్టు ఒక రుతువులో తయారుచేసే ఆహారాన్ని మేయాలంటే పాతికమంది పైనే కావలసి వస్తుంది.

సంపాదనను దాచుకునేవి

ఇంత కష్టపడి తయారుచేసుకుంటాయి కాబట్టే ఆహారం విలువ బాగా తెలుసు వాటికి. దుబారా చేయవు. ముందు ముందు కష్టకాలం వస్తుందేమోనని ముందు జాగ్రత్తలో ఉంటాయి.

మనం తినే బంగాళదుంప,చిలగడదుంప,కంద,పెండలం

49


చెరుకు,కేబేజి,పసుపు-ఇవన్నీ ఇలాంటివే. మరో విధంగా దాచుకునే ఆహారం వరి,గోధుమ,మొక్క జొన్న,అరటి,మామిడి,బత్తాయిలు.

మొక్కల్లో నీరు సరఫరా చెయ్యటానికి, ఆహారాన్ని పంపిణీ చెయ్యటానికి సన్న సన్న గొట్టాలుంటాయి. వేళ్ళు పీల్చిన నీటిని ఆకులకు అందించడానికి ఒకరకం సరఫరా గొట్టాలు పనిచేయగా, ఆకుల్లో తయారయ్యే ఆహారాన్ని మొక్కల్లో కావలసిన భాగాలకు చేరవేయటానికి మరొకరకం గొట్టాలు ఉపయోగపడతాయి.

సాధారణంగా మొక్కలు తమ మిగులు ఆహారాన్ని భూమి లోపల, తమకు చెందిన భాగాల్లో దాచుకుంటాయి. దీనివల్ల వాటికి చాల ఉపయోగాలున్నాయి.

భూమి లోపలి భాగాల్లో ఆహారాన్ని దాచుకోవటాన, దాచుకున్నది జంతువులకు, పక్షులకు తేలికగా కనిపించదు; కనిపించినా తినటానికి వాటికి అందుబాటులో వుండదు. ఒకవేళ నేలపైన ఉన్న మొక్క మొత్తాన్ని ఏజంతువైనా అమాంతం కబళించినా, లేక ఎండలకో, తుఫానుకో, వరదలు-వానలకో మొక్కంతా నాశనమైనా- ఆమొక్క తాలూకు నిలువ ఆహారం మాత్రం నేలలోపల భద్రంగా ఉంటుంది. దానితోపాటు కొన్ని వేళ్ళు ఉంటాయి కాబట్టి పరిస్థితులు అనుకూలించగానే చిగుర్చి పెద్దవవుతాయి.

వేళ్ళతోపాటు నేలలోపల ఆహారం నిలువ ఉండకపోతే

50


నేలపైన కనిపించే మొక్క చనిపోగానే నేలకింద ఏమీ మిగలదు.

ఈమొక్కలు ఆహారం తయారుచేసుకోను వీలుకానపుడు, రోజులు బాగాలేనపుడు దాచుకున్న నిలువ ఆహారాన్ని క్రమక్రమంగా వినియోగించుకుంటాయి.

అన్నిటికీ మించి ఈ నిలువ పదార్ధమంతా నేరుగా మన నోటికే చేరుతుంది.

మొక్కలు చేసే దొంగతనాలు

ఎంతో కష్టపడి ఇంత జాగ్రత్తగా తయారు చేసుకునే ఆహారాన్ని ముందు జాగ్రత్తకై దాచుకునే మొక్కలుండగా, మరీ సోమరిపోతులై పొరుగున ఉన్న మొక్కలు చేసుకొని దాచుకున్న ఆహారాన్ని కాజేసే మొక్కలూ ఉన్నాయి.

ఈ దొంగ మొక్కలు చూడటానికి మామూలుగానే కనిపిస్తాయి. అవి చేసే పని మాత్రం బయటకు తెలియదు,కనిపించదు కూడ.

పొగాకు మల్లె, కస్కుటాలు ఇలాంటివే. అంతదాక ఎందుకు- యోధులకు పట్టించే ‘వీరగంధాన్ని’ఇచ్చే గంధపు చెట్టు కూడ బాల్యంలో దొంగే. పక్కన పెరుగుతుండే ఇతర చెట్ల వేళ్ళతో ఈ గంధపు మొక్క తనవేళ్ళద్వారా ‘అక్రమ సంబంధం’ పెట్టుకుని దొరికిన పదార్ధాలను కాజేస్తుంది. ఏమీ ఎరగనట్లే ఆదొంగిలించిన పదార్ధాలను తన ఆహారంగా చేసుకుంటుంది.

ఎంగిలి కూటికి ఆశపడే ఈ దొంగచెట్లలో నాలుగు

51


రకాలున్నాయి. అవిచేసే దొంగతనాన్ని బట్టి, దొంగతనం చేసే పద్ధతిని బట్టి వాటిని అలా విభజించారు. కొన్ని మొక్కలు ఇతర చెట్ల కొమ్మలపై పెరిగి సంబంధం పెట్టుకుంటే, మరికొన్ని మొక్కలు ఇతర చెట్ల వేళ్ళతో సంబంధం పెట్టుకుంటాయి. నీటితో సహా తనకు కావలసిన పదార్ధాలనన్నింటినీ కొన్ని మొక్కలు దొంగిలించగా, మరికొన్ని మొక్కలు కొన్ని పదార్ధాలను మాత్రమే స్వీకరించి,వాటినుండి తమ ఆహారాన్ని తయారు చేసుకుంటాయి.

అంటే వండిన వంటకాలను మాత్రమే కాజేసి తినే దొంగలు ఒక రకం, బియ్యం,ఉప్పు-పప్పు లాంటి ముడి పదార్ధాలను మాత్రమే కాజేసి వాటితో తమ ఆహారాన్ని చేసుకునే దొంగలు మరికొందరన్నమాట.

దొంగ మొక్క నొకదాన్ని తీసుకుని అసలాపని ఎలాచేస్తుందో చూద్దాం.

పొగాకు వేసే వాళ్ళు చూసే ఉంటారు- ‘పొగమల్లె’ను. ఇది తన వేళ్ళతో పొగమొక్క, వంగ, రామములగ వంటి మొక్కలతో సంబంధం(వేళ్ళ ద్వారా) పెట్టుకుంటుంది. తనకు కావలసిన పదార్ధాలనన్నింటినీ తన వేళ్ళతో నేలనుండి పీల్చుకునే బదులు పక్కన పెరుగుతుండే పొగమొక్కనుండి పీలుస్తుంది. ఇలా ఒక రోజా! రెండు రోజులా! రోజూ ఇంతే.

దీనితో పొగ మొక్క బలహీన పడుతుంది (తను మాత్రం ఎంతకాలం భరించగలదు!). దాని మీద బతికే పొగమల్లె మాత్రం హాయిగా పెరుగుతుంది, చివరకు దాని ప్రాణలకే ఎసరు పెడుతుంది.

52


తాను మాత్రం దొంగిలించిన ఆహారం తింటూ కులుకుతూ ఉంటుంది. పైగా పూతవేసి, గింజల్ని తయారుచేసి తన సంతానాన్ని బాగా పెంచుకుంటూపోతుంది. దానికి కలిగే సంతానికీ ఇవే బుద్ధులు. అంతే ఈ దొంగ మొక్క పిల్లలూ పిల్లదొంగమొక్కలవుతాయన్నమాట. ఇవన్నీ పెరిగేటపుడు ఏదో ఒకమొక్కను పట్టుకుని వాటి జీవితాంతమూ పీడిస్తాయి. అందుకనే రైతులు పొగతోటను వేసేటపుడు ఈ పొగమల్లెను చేరకుండా జాగ్రత్తపడతారు.

తనకు కావలసినవన్నీ పక్కనే పెరిగే మొక్కనుండి దొరికేటపుడు ఇక నేలతో పనేముంది? అందుకని కొన్ని మొక్కలు పెద్దపెద్ద చెట్లను ఎన్నుకొని వాటి కొమ్మలమీద బతుకుతాయి. ప్రత్యేకంగా ఉండే వాటి వేళ్ళు ఆశ్రయమిచ్చిన చెట్టుకొమ్మలోకి తొలుచుకుపోయి నీరు,ఖనిజలవణాలు,ఇతర పదార్ధాలను కాజేసి హాయిగా బతుకుతాయి, పూలు పూస్తాయి, కాయలు కాస్తాయి.

ఉడతలు,పక్షుల మూలాన వీటి గింజలు ఇతర చెట్లమీదకు చేరి, అనుకూల పరిస్థితుల్లో పెరిగి పెద్దవవుతాయి. పెరిగిన తర్వాత అవి కూడ తల్లిమొక్కలాగానే సాగిస్తాయి తమ దొంగవ్యవహారాన్ని.

53


నోరులేని మొక్కలు నీరెలా తాగుతాయి

దప్పికైనపుడు, నోరు ఎండిపోయినపుడు మంచినీళ్ళు తాగుతాం. అసలు నోరే లేనపుడు మొక్కలు నీరెలా తాగుతాయి? తాగితే ఎన్ని తాగుతాయి?

నోరులేకపోయినా మొక్కలు మనకంటె ఎక్కువ నీళ్ళే తాగుతాయి. నిజానికి వాటికి అవి తాగేటన్ని నీళ్ళు అవసరం లేదు; అయినా తాగుతాయి. తాగే నీటిలో తొంభై వంతులు వృధాచేస్తాయి. ఊరకే బయట గాలిలోకి ఊది పారేస్తుంటాయి. నీరు దొరకని చోట పెరిగే ఎడారిమొక్కల విషయంలో మాత్రం పొరపాటునకూడ ఈపని జరగదులెండి.

నీళ్ళు తాగటానికే మొక్కలకు వేళ్ళున్నది. వర్షపునీరు భూమిలోకి ఇంకి పోతుంది. మట్టిరేణువుల చుట్టూ కొంత మిగిలి ఉంటుంది. దీనిని పీలుస్తాయి వేళ్ళు.

అన్ని మొక్కల వేళ్ళు ఒకలాగానే ఉండవు. ఈ విషయంలో మొక్కలను రెండు రకాలుగా విడదీయవచ్చు.

కొన్ని మరీ ముక్కుసూటిగా పోయేవి. వీటికి ముఖ్యమైన ఒక తల్లి వేరు ఉంటుంది. దాని నుండి శాఖోపశాఖలుగా ఎన్నో చిన్న చిన్న వేళ్ళు పుడతాయి. గులాబి, చిక్కుడు, వేప, మామిడి వగైరా చెట్లన్నీ ఇలాగే ఉంటాయి.

54



అదే - కొబ్బరి చెట్లను, అరటి, వరి మొక్కలను పరిశీలించండి. వీటన్నిటి వేళ్ళు గుబురుగా ఉంటాయి. గేదె తోక చివరి కుచ్చులా ఉంటాయి. వీటికి ఉండే అన్నివేళ్ళు ఒకేలా ఉండి, ఒకచోట నుండే పుడతాయి. వీటిని గుబురు వేరు మండలమని అంటారు. ఇంతకు ముందు చెప్పిన మరోరకాన్ని తల్లివేరు మండలమని పిలుస్తారు.

మిగతా విషయాలన్నీ పెరిగే నేలను బట్టి, చెట్టును బట్టి ఉంటాయి. ఎటువైపు ఎక్కువ నీరు దొరుకుతుందో అటువైపు బాగా వ్యాపిస్తాయి.

ఒక్కోసారి నేలపైన కనిపించే కాండం కంటె, నేలకింద ఉండే వేళ్ళే పొడుగ్గా ఉంటాయి. గోధుమ విషయం చూద్దాం.

గోధుమ మొక్క కాండం సాధారణంగా ౩నుండి౪అడుగుల ఎత్తు పెరగగా దాని వేరు మాత్రం ౯నుండి౧౦అడుగుల కిందికి దిగుతుంది. అంటే దాని కాండం మనకంటె తక్కువ ఎత్తుండగా దాని వేళ్ళు మాత్రం మనకంటె రెట్టింపు పొడవు ఉంటుందన్న మాట. మరికొన్ని మొక్కలకైతే వేళ్ళు ౨౦నుండి ౩౦ అడుగుల పొడవు ఉంటాయి.

ఎక్కువ వానలు పడని ప్రదేశాలలోను, నీళ్ళు విరివిగా దొరకని భూముల్లోను పెరిగే మొక్కల వేళ్ళు నేలమట్టానికి కొంచం కిందుగా దట్టంగా వ్యాపించి ఉంటాయి. పడ్డ కాసిని వాన

55


నీళ్ళు నేలలోకి ఇంకిపోకముందే పీల్చివేయాలికదా. అదేకారణం.

ఎక్కడానీళ్ళు దొరకనపుడు నీళ్ళకోసం వేళ్ళు బాగా లోతుకు పోతాయి. కొన్ని మొక్కల వేళ్ళు నేలలోపలికి ఎంత లోతుకు పోతాయో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.

ఒక మోస్తరు పెద్దచెట్టు వేళ్ళను తూచి ఒకదానితో మరొకటి కలుపుకుంటూ పోతే ఎన్నోమైళ్ళు పోవలసి వస్తుంది. ఉదాహరణకు ‘రై’ మొక్క వేళ్ళపొడవు ఎంత ఉంటుందో చూశారు. చిన్నదిగానే కనిపించే ఈమొక్కకు 1,38,10000 వేళ్ళు ఉన్నట్లుగా తెలుస్తుంది. వీటన్నిటిని తుంచి, తాడులాగ ఒకదానితో మరొకటి కలిపి కొలిస్తే వాటి పొడవు 387 మైళ్ళు ఉంటుందట.

ఇంత సంఖ్యలో ఉండేవి, ఇంతపొడవు ఉండే వేళ్ళు ఎంత నీటిని పీల్చగలవో ఊహించండి. ఇంత చిన్న మొక్కకే ఇన్ని వేళ్ళుంటే యేండ్ల తరబడి పెరిగే వేప, మఱ్ఱి, రావి చెట్ల సంగతి ఊహించండి.

తాగే నీరంతా మొక్కలకు అవసరం లేదు, వినియోగించుకోవు. అందువల్ల ఆకులకు చేరుకోగానే అవసరానికి వాడుకోగా మిగిలిన నీటిని ఆకుల్లోని పత్రరంధ్రాల ద్వారా బయటకు పంపేస్తాయి.

56


దప్పిక తీర్చేవి


తమ దప్పిక తీర్చుకోవటమే కాక ఇతరుల దప్పికను కూడ తీరుస్తాయి మొక్కలు. ఈ పనిచేసే ‘రేవినెలా’ చెట్టు ‘యాత్రీకుల వృక్షమని’ పేరుతెచ్చుకుంది.

మెడగాస్కరులో పెరిగే ఈ చెట్టు మనకంటె ఆరురెట్లు పొడవుంటుంది, లావుపాటి బోదెఉంటుంది. ఆకులు కూడ పెద్దవే, అరటి ఆకుల్లాగ కనిపిస్తాయి. అందరూ చెప్పేదాని ప్రకారం ఈ ఆకుల మొదళ్ళు దొప్పల మాదిరిగా ఉండటాన దానిలో చేరి నిలిచే నీరు పూర్వం యాత్రికుల దప్పిక తీర్చేవట .

మన ఇళ్ళ చుట్టూ కనిపించే కొబ్బరిచెట్టు కూడ ఇలాంటిదే కదా! మనకోసం కాసిన నీళ్ళను కాసిన కాయల్లో దాచి ఉంచుతుంది.

ఒక చెట్టు నుండి మరో చెట్టు

అందంగా రంగుల్తో ముస్తాబు చేసుకుని కనిపిస్తాయి పూలు. చెట్లను బట్టి పూలు ఉంటాయి. శాస్త్రజ్ఞులైతే పూలనుబట్టే చెట్లను గుర్తిస్తారు, నిర్ణయిస్తారు.

అన్ని చెట్లు పూలు పూయాలనేమీ లేదు. అంటే చేతకాక కాదు, కొన్ని మొక్కలు పూల బదులు వేరే యేర్పాట్లను చేసుకుంటాయి. పూలు

57


పూయటాన్ని బట్టే మనకు కనిపించే మొక్కలన్నిటిని ‘పూలు పూసేవి’, ‘పూలు పూయనివి’ అని రెండు రకాలుగా విభజించారు. నాచు, పాచి మొక్కలు, ఫెరనుల్లాంటివి పూలు పూయని మొక్కలకు ఉదాహరణ.

ప్రతిజీవి తన సంతానాన్ని పెంచుకోటానికే ప్రయత్నం చేస్తుంది. జంతువులు పిల్లల్ని పెడతాయి. పక్షులు గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని చేస్తాయి. ఈ ఉద్దేశంతోనే మొక్కలు గింజల్ని తయారు చేస్తాయి. పూసిన పూలు కాయలుగా మారతాయి. గింజలు కాయల లోపల ఉంటాయి.

మొక్క బాగా ఎదిగి ఒకదశకు చేరిన తర్వాత పూత వేయటం ప్రారంభమవుతుంది. కొన్ని మొక్కలు పుట్టిన కొన్ని రోజులకే పూతవేయగా మరికొన్నయితే సంవత్సరాల తర్వాతనే వేసేది.

ఇలాంటిదే తాటిచెట్ల తరగతికి చెందిన ‘టాలిపోట్ పామ్’ చెట్టు. పూతవేయటానికి 75 యేండ్లు పడుతుంది. జీవితంలో ఒక్కసారే ఇది పూతపూసేది. ఆ తర్వాత చచ్చిపోతుంది. విసనకఱ్ఱల్లాంటి ఆకుల గుబురును చీల్చుకుంటూ వస్తాయి వీటి తెల్లటి పూలు. చచ్చిపోబోయే ముందు ఈచెట్టు80 అడుగుల ఎత్తు ఎదుగుతుంది.

‘శతాబ్దపు చెట్టు’ గా పేరుతెచ్చుకున్నది మరొక చెట్టు.

58


వందేళ్ళు వస్తే కాని పూలు పూయదంటారు ఇది. ఈ నూరేళ్ళ పూతలో దాని ‘నూరేళ్ళ జీవితం’ పరిసమాప్తమవుతుంది. నిజానికి ఇది సరిగ్గా నూరేళ్ళయిన తర్వాతనే పూలు పూయటమేమో్కాని, పూతవేయటానికి మాత్రం చాలా కాలం పడుతుంది.

పూలన్నీ తలలో పెట్టుకోను వీలుగా ఉండేటంత చిన్నవిగాను, నాజూకుగాను ఉండాలని లేదు. మనం మోయలేనంత పెద్ద పెద్ద పూలు కూడ ఉన్నాయి. ‘రేప్లేషియా’ మొక్క ఇలాగే పూస్తుంది.

ముందు-వెనక చూడకుండ పది-పన్నెండు కిలోల బరువు ఉండే పూవును పుట్టిస్తుంది. ౩౦ అంగుళాల కొలత ఉంటుంది. ఇంత పెద్ద పూవుకు ఎంత బాగా వాసన ఉంటుందో అని ఆశపడేరు.

మాంసం రంగులో కనిపించే ఈ పువ్వు నుండి చెడిపోయిన మాంసం వాసన వస్తుంది. అస్సలు భరించలేం. ఈదుర్వాసన కొన్ని క్రిమి కీటకాల బారిట సువాసన. అందుచేత ఈ పువ్వు చుట్టూతా చేరతాయి. వీటివల్ల ఈ పూలకు పరపరాగ సంపర్కం తేలికగా జరుగుతుంది.

పువ్వే ఇంత పెద్దదిగా ఉంటే చెట్టు ఇంకెంత పెద్దదిగా ఉంటుందో అని చూస్తే ....నిరాశే.

‘పేరు గొప్ప-ఊరు దిబ్బ’ అన్నట్లుగా ఉంటుంది దీని సంగతి. ఈ మొక్కలో ..పెద్దదిగా ఉండే భాగం దీని పువ్వే. మిగిలిన మొక్కంతా

59


నాలుగు సన్నని దారపు పోగుల్లా ఉంటుంది. పైగా అదీ నేలలోపలే. పైకి కనిపించేదెల్లా దాని పువ్వొక్కటే. ఈమొక్కలు హిమాలయాల్లో కనిపిస్తాయి.

కీటకాలను, తేనెటీగలను, సీతాకోక చిలుకలను ఆకర్షించటానికై పూలు రంగు రంగుల్లో తయారవుతాయి. పూలలోపల తియ్యటి మకరందాన్ని దాచిపెట్టి ‘ఎర’గా వాడతాయి. కొన్ని కీటకాలు కేవలం వీటి వాసనకే ఆకర్షించబడతాయి.

ఏదో విధంగా ఆకర్షించబడ్డ జీవులు పువ్వుమీద వాలిన తర్వాత తిరిగి వెళ్ళేటపుడు తమతోపాటు తెలిసోతెలియకో పుప్పొడిని తీసుకువెళతాయి. ఆ తర్వాత మరోపువ్వు మీద వాలినపుడు తనతో పాటు తీసుకువెళ్ళిన పుప్పొడి మూలాన పరాగసంపర్కం జరుగుతుంది. ఫలితంగా పువ్వు కాయగా మారుతుంది.

కాయ క్రమంగా పెరుగుతూ తనలోపలి గింజలను కూడ పెంచుతుంది. ముదిరిన గింజలు నేలపై చల్లితే మొలకెత్తటానికి తయారుగా ఉంటాయి. గిజలతోపాటు కాయలోపల కండ కూడ ఉంటుంది కాబట్టి మనలాంటి వాళ్ళు తినటానికై కోసుకుంటారు. కండని తిన్న తర్వాత గింజల్ని పారేస్తాం. నేలపైబడ్డ గింజలు పరిస్థితులు అనుకూలించగానే మొలకెత్తుతాయి. ఇలా చెట్టునుండి మరో చెట్టు, ఒక చెట్టు నుండి వందల చెట్లు.

60


జ్ఞానోదయం

బుద్ధుడికి జ్ఞానోదయమయింది చెట్టు కిందనే. ఇంతటి విశాల ప్రపంచంలో బుద్ధుడికి దొరికిన సరైన చోటు చెట్టుకిందనే. బొధివృక్షం కింద కూర్చుని తపస్సు చేయటంవల్ల సిద్ధార్ధుడల్లా బుద్ధుడయ్యాడు.

అంతటి గొప్పవాణ్ణి చేసిన ఈచెట్టు మనకు కూడ ఏమైనా సలహా ఇస్తుందేమోనని అడిగితే బహుశః ఇలా చెప్పవచ్చు.

రంగురంగుల పూలమాదిరిగా అందంగా ఆకర్షనీయంగా
ఆనందంగా ఉండాలని,
మొలకెత్తే విత్తనాల మాదిరిగా- మట్టిలో పెట్టి అంధకారంలోకి
అణగ దొక్కినా నవ్వుతూ వెలుగులోకి లేచి రావాలని,
నవరసాలు చిలికించే పండ్లు-ఫలాల మాదిరిగా అందరికీ
ఆహ్లాదాన్ని అందించాలని,ఉపయోగ పడాలని,
పచ్చరంగు పులుముకున్న ఆకులలాగ కలకాలం పచ్చపచ్చగా
ఉండాలని

అనవచ్చు.
-----------------------

పిల్లలకు పేదరాసి పెద్దమ్మ కధలు మాత్రమే చెపుతూ కాలం గడిపే రోజులు కావివి. అంటే వారి ఆనందాన్ని కాదనటం కాదు. ఆ కధలతో ఏయే నీతులు, ఆదర్శాలు, విజ్ఞానం నేర్పుతామో, హత్తుకునేలా చెపుతామో, వాటిని సైన్సు విషయాలతో కూడ జోడించి చెప్పవచ్చు. పైగా అదనంగా శాస్త్రీయదృక్పధాన్ని కలిగించవచ్చు, పరిశీలనాశక్తిని, ఆసక్తిని పెంచవచ్చు. ఇదే ముఖ్యమైన ఆశయం-ఈ చిన్న పుస్తకాన్ని తయారుచేయటం.

ఉప్పును ఉప్పులా తినలేం. నోరు ఒప్పుకోదు. దానినే కొంచెం తీసుకుని వంటకాలలో వాడితే ఎంతో రుచి తెస్తుంది. అలాగే సైన్సు పుస్తకాల్లో చెప్పే విషయాలకన్నా, వాటిలో కొన్ని తీసుకుని రాసిన ఇతర పుస్తకాల్లోనివే ఆకర్షణీయంగా ఉంటాయి. అదే-ఈ పుస్తకంలో చేసిన ప్రయోగం.